Begin typing your search above and press return to search.

మ‌మ‌త పార్టీలో మ‌రో నుపుర్ శ‌ర్మ ఈమేనా?

By:  Tupaki Desk   |   7 July 2022 6:30 AM GMT
మ‌మ‌త పార్టీలో మ‌రో నుపుర్ శ‌ర్మ ఈమేనా?
X
బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన చేసిన దేశ‌విదేశాల్లో దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు బీజేపీ ఆమెను పార్టీ నుంచి కూడా బ‌హిష్క‌రించింది. నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన ఒక టైల‌ర్ ను రాజ‌స్థాన్ లో మ‌తోన్మాదులు దారుణంగా హ‌త్య చేశారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇంకా నుపుర్ శ‌ర్మ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీకి చెందిన ఎంపీ మహువా మోయిత్రా.. కాళీ మాత‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు.

ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్యలు హిందువుల‌ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ మ‌ధ్యప్ర‌దేశ్ బీజేపీ నాయకుడు జితేన్ ఛటర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భోపాల్ పోలీసులు ఆమెపై ఐపీసీ 295A సెక్షన్ కింద కేసు పెట్టారు. మరోవైపు మహువా మోయిత్రా వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా స్పందించారు. ఆమె కాళీ మాత‌పై చేసిన వ్యాఖ్య‌లు హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయ‌ని విమ‌ర్శించారు.

మ‌రోవైపు తృణ‌మూల్ కాంగ్రెస్ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. త‌మ ఎంపీ ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్య‌ల‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్య‌లు పూర్తిగా ఆమె వ్య‌క్తిగ‌త‌మ‌ని తెలిపింది.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ లో ఎంపీ మహువా మోయిత్రా కూడా ట్వీట్ చేశారు. తాను దేనికీ భయపడబోనని ఆమె ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మీ గూండాలకు, మీ పోలీసులకు, మరి ముఖ్యంగా మీ ట్రోల్స్‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ప‌రోక్షంగా బీజేపీ నేత‌ల‌కు, హిందూ సంఘాల‌కు వార్నింగ్ ఇచ్చారు.

కాగా ద‌ర్శ‌కురాలు లీనా మణిమేగలై తన తాజా చిత్రం కాళీ కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కోల్‌కతాలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఎంపీ మహువా మోయిత్రా మాట్లాడుతూ.. కాళీ మాత మాంసాహారం, మద్యపానం స్వీకరించే దేవతగా ఊహించుకునే హక్కు తనకు ఉందని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. భూటాన్ లేదా సిక్కింకు వెళితే.. అక్కడ‌ దేవుడికి విస్కీ ఇస్తార‌ని వ్యాఖ్యానించ‌డంపై ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.