Begin typing your search above and press return to search.

వయగ్రా నీళ్లు తాగిన గొర్రెలంటూ మీడియాను గొర్రెల్ని చేసేశారే..!

By:  Tupaki Desk   |   13 Dec 2019 1:30 AM GMT
వయగ్రా నీళ్లు తాగిన గొర్రెలంటూ మీడియాను గొర్రెల్ని చేసేశారే..!
X
ఇవాల్టి రోజున ప్రపంచం కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్ కు తోడుగా డిజిటల్ విప్లవంతో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. ఆసక్తికర అంశాలు.. అబద్ధాలు వాయు వేగంతో వ్యాప్తి చెందుతున్నాయి. అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేయటం.. అలాంటి వాటిని క్రాస్ చెక్ చేసే విషయంలో మీడియా సంస్థలకు టైం లేకపోవటం.. పని చేసే సిబ్బందిలోనూ ఆ నైపుణ్యం తక్కువగా ఉండటంతో కొన్ని అబద్ధపు వార్తలు నిజాలుగా వైరల్ అవుతుంటాయి. గడిచిన రెండు రోజులుగా ఒక వార్త ప్రపంచంలోని చాలా మీడియా సంస్థల్ని తప్పులో కాలేసేలా చేసింది.

ఒక అందమైన అబద్ధాన్ని.. నిజమని నమ్మేలా చేసిన ఒక తప్పుడు వార్త పుణ్యమా అని ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన మీడియా సైతం గొర్రెలకు తీసిపోదన్నట్లుగా చేసేశారు. ఇంతకూ జరిగిందేమంటే.. ఐర్లాండ్ లో జరిగినట్లుగా ఈ తప్పుడు వార్త విపరీతంగా వైరల్ గా మారింది. ఒక ఇంగ్లీషు వెబ్ సైట్ తయారు చేసిన కల్పిత కథనం అందరిని విపరీతంగా ఆకర్షించింది.

ఐర్లాండ్ లోని రింగాస్కిడ్జి ఓడరేవులో ఒక రసాయన కంపెనీ శుద్దిచేయని వయాగ్రా మాత్రల్ని టన్నుల కొద్దీ డంప్ చేసిందని.. ఆ నీళ్లను తాగిన గొర్రెలు వారం రోజుల పాటు అంతులేని లైంగిక ఉత్తేజం పొందినట్లుగా కథనాన్ని అల్లేశారు. సెక్స్ కోసం అవి తీవ్రంగా తపించాయని.. సుదీర్ఘ స్తంభనలతో పిచ్చెక్కిపోయినట్లుగా అచ్చేశారు.

ఈ కథనాన్ని కొన్నిపెద్ద మీడియా సంస్థలు కూడా తీసుకొని తమకు తగ్గట్లుగా మార్చుకొని రాయటం.. ఇలా ఒకరిని చూసి మరొకరు కథనాలు రాసేయటమే కాదు.. ఈ ఉదంతంలో నిజం ఎంతన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసే విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో.. ఈ తప్పుడు వార్త విపరీతంగా వైరల్ గా మారింది. చివరకు ఇది తప్పుడు వార్తగా తేలటంతో.. ఇప్పటికే ఈ కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థలు తమ తప్పును తెలుసుకొని నాలుకర్చుకొని డిలీట్ చేసే పనిలో పడ్డాయి. ఈ ఉదంతంతో మీడియా సైతం గొర్రెల మాదిరే మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.