Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. ఇంట్లోనూ 'దూరం'.. లాభం ఎంతంటే?

By:  Tupaki Desk   |   25 March 2020 11:30 PM GMT
కరోనా వేళ.. ఇంట్లోనూ దూరం.. లాభం ఎంతంటే?
X
మాయదారి కరోనా మనిషికి మనిషికి దూరాన్ని పెంచటమే కాదు.. ఆప్తులు.. ఆత్మీయుల్ని సైతం కలుసుకోలేకుండా చేసింది. అంతేనా.. ఇంట్లో ఉన్న వారిని సైతం దగ్గరగా ఉండే విషయంలోనూ పరిమితులు తప్పనిసరి అని చెబుతున్నారు. ఇంతకాలం పట్టించుకోని ‘సామాజిక దూరం’ ఇప్పుడు తప్పనిసరైంది. ఇంటా.. బయటా.. ఎక్కడైనా సరే.. మనిషికి మనిషికి మధ్య దూరం ఇప్పుడు తప్పనిసరి. కరోనాను కట్టడి చేయాలంటే.. సామాజిక దూరానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు.

ఇంట్లో నుంచి బయటకు రాకపోవటం.. ఒకవేళ వచ్చినా సామాజిక దూరాన్ని విధిగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకూ బయటకు వచ్చినప్పుడు మాత్రమే పాటించే ఈ తీరు.. ఇంట్లోనూ అమలు చేయాలన్న సూచనను చేస్తున్నారు. దీనికి కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి 62 శాతం తగ్గే వీలుందని చెబుతున్నారు. ఇంట్లోని వారితోనూ సన్నిహితంగా లేకుండా.. కనీసం మీటరు నుంచి మూడుమీటర్ల దూరాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

లాక్ డౌన్ వేళ.. విధించే పరిమితుల్ని పాటిస్తూ.. ఇంట్లో ఉన్న వారితోనూ దూరంగా ఉండటం ద్వారా.. ఎవరికి వారు వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. ఎదుటివారి ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుందని చెబుతున్నారు. ఈ మాట చెప్పింది ఆషామాషీ వ్యక్తి కానే కాదు. భారత వైద్య పరిశోధన మండలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమన్ ఆర్ గంగాఖేడ్కర్ వెల్లడించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకాలం ఇంటి బయట అమలు చేసిన సామాజిక దూరాన్ని ఇకపై ఇంట్లోనూ పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇక.. ప్రసార మాధ్యమాల్లో కరోనాకు మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ గా ప్రచారం సాగుతోంది. దీంతో.. కొంతమంది సొంత తెలివిని ప్రయోగించి.. ఈ మందును వాడేస్తున్నారు. అలా చేస్తే ప్రాణాలకు ముప్పు అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మందును వైద్యులు తప్పించి సామాన్యులు ఎవరూ సొంతంగా వాడే సాహసం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సో.. కరోనా లెక్క తేల్చే వరకూ ఇంట్లోనూ ‘దూరం’ పాటించాల్సిన అవసరం ఎంతో అర్థమైందా?