Begin typing your search above and press return to search.

పోలీసులపై ‘రౌడీయిజం’ చేసిన మజ్లిస్ కార్పొరేటర్ అరెస్టు

By:  Tupaki Desk   |   6 April 2022 11:03 AM GMT
పోలీసులపై ‘రౌడీయిజం’ చేసిన మజ్లిస్ కార్పొరేటర్ అరెస్టు
X
హైదరాబాద్ నగర పోలీసులపై చెలరేగిపోయిన భోలక్ పూర్ మజ్లిస్ కార్పొరేటర్ అరెస్టు అయ్యారు. 'ఇది నా అడ్డా'.. జాగ్రత్తగా ఉండాలన్న మాటతో పాటు.. వంద రూపాయిల వ్యక్తివి నువ్వు అంటూ పోలీసులపై ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం.. అర్థరాత్రి రెండు గంటల వేళలో షాపులు తెరిచి ఉన్న నేపథ్యంలో పోలీసులు మూసివేయాలని కోరటం.. ఈ సందర్భంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భోలక్ పూర్ డివిజన్ మజ్లిస్ కార్పొరేటర్ మహమ్మద్ గౌసుద్దీన్ ఎంట్రీ ఇచ్చి.. పోలీసులకు థమ్కీ ఇచ్చిన వీడియో ఒకటి బయటకు రావటం తెలిసిందే.

ఈ వీడియో వైరల్ కావటం.. తీవ్ర విమర్శలతో పాటు.. నగర పోలీసుల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించటమా? అన్న విస్మయం వ్యక్తం కావటంతో పాటు.. ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు రెండు రోజుల పాటు ఎలాంటి చర్యలు లేకపోవటం.. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు విమర్శలు చేయటం.. మజ్లిస్ నేతల గూండాగిరి ఎక్కువైందని.. పోలీసుల్ని ఉద్దేశించి అంత అవమానకరంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒకరు మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతాకు ట్వీట్ చేసి.. పోలీసుల్ని అవమానించిన రీతిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి.. తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్ ఆదేశానికి స్పందించిన పోలీసులు భోలక్ పూర్ కార్పొరేటర్ ను అరెస్టు చేశారు.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. దురుసుగా ప్రవర్తించినందుకు అతనిపై ఐపీసీ సెక్షన్ 350, 506 కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ ట్వీట్ స్పందనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నప్పుడు.. మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ స్పందించే వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం ఏమిటని మండిపడుతున్నారు. హైదరాబాద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి.. రెండు రోజులు గడిచిన తర్వాత కేసు నమోదు చేయని పోలీసులు.. కేటీఆర్ ఆదేశాలకు ఆగమేఘాలపై రియాక్టు అయిన తీరును తప్పు పడుతున్నారు. ట్వీట్ కు స్పందించి.. ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్ ఇప్పుడు కార్నర్ అయ్యారని చెప్పక తప్పదు.