Begin typing your search above and press return to search.

మసీదులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 11:18 AM IST
మసీదులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
X
ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ లోని ఓ మసీదులో శుక్రవారం జరిగిన ఓ బాంబు పేలుడులో కనీసం 50 మంది చనిపోయుంటారు. వారం క్రితమే జరిగిన బాంబు పేలుడులో సుమారు 150 మంది చనిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ రెండు బాంబు పేలుళ్ల ఘటనల్లో కొట్టొచ్చినట్లు కొన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేమిటంటే రెండు చోట్ల బాంబులు పేల్చింది ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే తీవ్రవాద సంస్థ. రెండు బాంబులు కూడా పేలింది మసీదుల్లోనే.

మూడో అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే బాంబు దాడుల్లో చనిపోయింది, తీవ్రంగా గాయపడింది షియా ముస్లింలే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముస్లింల్లోనే షియాలకు సున్నీలకు ఏ మాత్రం పడదు. ప్రస్తుతం దేశంలో సున్నీల చేతిలో అధికారం ఉంది. పైగా ఐఎస్ అనే తీవ్రవాద సంస్ధలకు షియాలంటే బాగా మంట. నిజానికి దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్లకు ఇపుడు జరుగుతున్న బాంబుదాడులకు సంబంధం లేదనే చెప్పాలి.

ఎలాగంటే దాడులు చేస్తున్నది తామే అని ఐఎస్ సంస్థ అగ్రనేతలు ప్రకటించుకుంటున్నారు. ఐఎస్ తీవ్రవాదులకు ఇటు షియాలంటే పడటం లేదు అలాగే తాలిబన్లతో తీవ్రస్థాయిలో వైరం ఉంది. అంటే ఏకకాలంలో ఐఎస్ తీవ్రవాదులు షియాలు, తాలిబన్లపై బాంబు దాడులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిపోతోంది. అయితే ప్రధానంగా మసీదుల్లోనే బాంబులు ఎందుకు పెడుతున్నారు ? ఎందుకంటే కొన్ని మసీదుల్లోకి ప్రత్యేకంగా షియాలు మాత్రమే వెళతారన్న విషయం ఐఎస్ తీవ్రవాదులకు బాగా తెలుసు.

పబ్లిక్ ప్లేసెస్ లో బాంబులు పెడితే షియాలతో పాటు ఇతరుల కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ చనిపోయే వారిలో సున్నీలతో పాటు ఇతర వర్గాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. అందుకని షియాలు మాత్రమే హాజరయ్యే మసీదులనే ఐఎస్ తీవ్రవాదులు ఎంపిక చేసుకుంటున్నారు. దీనివల్ల మసీదులు బాంబుదాడులతో నేలమట్టమవ్వటంతో పాటు ఎక్కువమంది షియాలు ఒకేసారి చనిపోవటం+తీవ్రస్ధాయిలో గాయపడుతున్నారు.

అంటే ఐఎస్ తీవ్రవాదుల ఆలోచనలు దారుణమనే చెప్పాలి. ప్రపంచం మొత్తాన్ని ముస్లిం రాజ్యంగా అంటే ఖలీఫా రాజ్యంగా చేయాలని కలలు కంటున్న ఐఎస్ తీవ్రవాదులు మరోవైపు సాటి మనుషులను అందులోను ముస్లింలు ప్రత్యేకించి షియాలను టార్గెట్ గా చేసుకుని మారణహోమానికి పాల్పడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. తమ ప్రాణాలకు భద్రత లేదన్న కారణంగానే దేశంలోని లక్షలాది మంది అమాయక ప్రజలు విదేశాలకు వెళ్లి పోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఐఎస్ తీవ్రవాదుల టార్గెట్ చూస్తుంటే ఈ దాడులు ఇప్పట్లో ఆగేట్లు లేదు. ముందు ముందు ఇంకెన్ని దాడులు చూడాలో ఏమో.