Begin typing your search above and press return to search.

బిఫోర్ కరోనా..ఆఫ్టర్ కరోనా..ఏం జరగబోతోంది?

By:  Tupaki Desk   |   13 April 2020 2:45 AM GMT
బిఫోర్ కరోనా..ఆఫ్టర్ కరోనా..ఏం జరగబోతోంది?
X
మానవ పరిణామ క్రమంలో చరిత్రను చెప్పేటప్పుడు క్రీస్తుకు పూర్వం(B.C).. క్రీస్తు శకం(A.C) అని వాడతాం. అంటే క్రీస్తు పుట్టుకకు ముందు వెనుకబడిన నాగరికత ఉండేది. క్రీస్తు పుట్టాక నవ శకం ఆరంభమైంది. క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచే మనకు సంవత్సరాలు మొదలయ్యాయి. ఇప్పటికీ క్రీస్తుపుట్టి 2020 సంవత్సరాలు అయ్యాయి.

ఇప్పుడు క్రీస్తులాగే మరో శకం ఆరంభమైంది. అదే ‘కరోనా శకం’.. బిఫోర్ కరోనా (B.C), ఆఫ్టర్ కరోనా (A.C)గా అభివర్ణిస్తున్నారు. కరోనా రాక ముందు జనాలు ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనే వారు.. మరి ఇప్పుడు కరోనా వచ్చి అందరినీ కబళించడంతో ‘హెల్త్ ఈజ్ లైఫ్’ అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకడానికి.. బతికి బయటపడడానికి తప్ప మనుషులకు మరో ఆప్షన్ లేకుండా చేసింది కరోనా వైరస్. దాని నియంత్రణ తప్ప మందు లేని పరిస్థితి. దీంతో అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. కరోనా ఉత్పాతాన్ని తట్టుకొని మనుగడ సాగిస్తున్నారు.

*కరోనా తో ప్రపంచంలో మార్పు వస్తుందా?

కరోనా వైరస్ కరాళనృత్యానికి ప్రపంచవ్యాప్తంగా జనాలకు బుద్ది వచ్చింది. కోట్లు - లక్షలు సంపాదించడం కాదు.. బతకడమే గొప్ప అన్న సూక్ష్మ విషయం తేటతెల్లమైంది. అందుకే ఇప్పుడు అందరూ తమ లైఫ్ స్టైల్ ను మార్చుకునే పడిలో పడ్డారు. ఓ హాలీవుడ్ సినిమాలో చూపించినట్టే జనం డబ్బుల వెంట ఉద్యోగాల వెంట.. విదేశాలకు డాలర్ల వెంటపడి పోకుండా ఉన్న ఊళ్లోనే దర్జాగా బతకాలని డిసైడ్ అవుతున్నారు. అమెరికా - ఇటలీ వంటి అభివృద్ది చెందిన దేశాలకు మన వాళ్లు పోయి అక్కడ దిక్కుమాలిన చావులు చచ్చేకంటే దేశంలోనే కలోగంజో తాగి బతకడం బెటరన్న అభిప్రాయానికి వచ్చారు.

*శుచి, శుభ్రత, ప్రకృతిపై ప్రేమ పెరగొచ్చు

ఇన్నాల్లు అడవులు నరికేశాం.. అటవి జంతువులకు ఆవాసం లేకుండా తరిమేశాం. మనుషులను తప్ప అన్నింటిని తినేశాం. కానీ ఇప్పుడు ప్రకృతే కరోనా వైరస్ తో పగబట్టింది.. మనల్ని కబళించింది. దీంతో మనుషులకు దెబ్బకు శుచి - శుభ్రత - ప్రకృతిపై ప్రేమ ఖచ్చితంగా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కరోనా తర్వాత మనుషుల లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని తెలుస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు - ప్రకృతితో జీవనం అలవాటు చేసుకుంటారు. డాలర్లు, డబ్బు వెంట పరిగెత్తకుండా సంతోషకరమైన జీవనం సాగిస్తారు.

*ఆడంబరాలు ఔటే..

ఇన్నాళ్లు పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు చేసి చేసేవారు. ఇప్పుడు కరోనా దెబ్బతో పెళ్లిళ్లే కాదు.. పండుగలు - పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసుకునే ఖర్మ పడుతుంది. ఎందుకంటే ఎక్కువమందితో చేస్తే కరోనా అంటుకుంటుంది. ఫంక్షన్ హాల్లు - సెట్టింగులకు కాలం చెల్లి సుబ్బరంగా గ్రామాల్లోని సొంతిళ్లలో తక్కువ మందితో వేడుకలు చేసుకునే రోజులు రానే వస్తాయి.

*ఇక ఆరోగ్యకరమైన తిండే దిక్కు

ఇష్టానుసారం తినే తిండి విషయంలోనూ కరోనా తర్వాత మార్పు రావడం ఖాయమంటున్నారు. పిజ్జాలు - బర్గర్లు - జంతువులను తినడం మాని ఆరోగ్యకరమైన ఫుడ్డు - డైట్ ఉన్న ఆహారానికి డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక కరోనా లాంటి వైరస్ నుంచి కాపాడే ఇమ్యూనిటి పెంచే ఆహారాన్నే మెనూలో అందరూ పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొత్తంగా ఆఫ్టర్ కరోనా ప్రపంచం మారుతుంది. తర్వాత తరం వాళ్లు కూడా ఇక బిఫోర్ కరోనా.. ఆఫ్టర్ కరోనా అని చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా కరోనాతో ప్రకృతి ఆడించిన ఆట. ఈ ఆటతో మానవుడు సెట్ రైట్ అవుతాడనే ఆశిద్దాం.