Begin typing your search above and press return to search.

అమెరికాలో వెబ్ సైట్ల హాహాకారాలు!

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:43 AM GMT
అమెరికాలో వెబ్ సైట్ల హాహాకారాలు!
X
శుక్రవారం సాయంత్రం భరత కాలమానం ప్రకారం 4.30 గంటల సమయంలో అమెరికాలో ఒక్కసారిగా ఒకటే కల్లోలం... ట్విటర్ - అమెజాన్ - స్పాటిఫై - నెట్‌ ఫ్లిక్స్ - టంబ్లర్ - రెడిట్ వంటి ప్రముఖ వెబ్‌ సైట్ ల సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో ఉన్నట్లుండి నగదు బదిలీకి వాడే పేపాల్ కూడా పనిచేయడం మానేసింది.. దీంతో అమెరికాలో ప్రజలకు అయోమయం నెలకొంది. ఏమైందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన అగ్రరాజ్యానికి ఇంటర్నెట్‌కు అనుసంధానమైన వెబ్‌ కామ్‌ లు - రూటర్లు - సెట్‌ టాప్ బాక్సులు - డీవీఆర్‌ ల సాయంతో హ్యాకర్లు సైబర్ దాడి చేశారని అర్ధమయ్యింది. దీంతో ఇంజినీర్లు శ్రమించి రెండు గంటల అనంతరం సేవల్ని పునరుద్ధరించారు. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు మరలా రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ దాడి జరగడంతో అమెరికాలో ఇంటర్నెట్ రూట్లతో పాటు ట్రాఫిక్‌ ను నియంత్రిస్తోన్న న్యూ హ్యాంప్‌ షైర్‌ కు చెందిన డైన్ కంపెనీ సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో మూడు గంటల పాటు సేవల్ని నిలిపివేశారు.

ఈ విషయాలపై స్పందించిన డైన్ సంస్థ అసలు విషయాలను వెళ్లడించింది. ఆ వివరాల ప్రకారం వెబ్‌ సైట్ డొమైన్‌ లను హ్యాకర్లు టార్గెట్ చేశారట. డీడీఓఎస్ పేరిట వేలకొద్దీ అభ్యర్థనలు ఈ సర్వర్లపై ఒక్కసారిగా దాడి చేశాయని, అయితే ఈపని ఎవరు చేశారనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదని చెబుతోంది. ఇదే క్రమంలో సీ.ఎన్‌.ఎన్ - ద గార్డియన్ - వైర్డ్ - హెచ్‌.బీ.ఓ వంటి సైట్లు కూడా పనిచేయలేదని ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ గిజ్‌ మోడో తెలిపింది. దీంతో అమెరికా తూర్పు తీర ప్రాంతం - టెక్సాస్ రాష్ట్రాల్లో లెవల్ 3 సమాచార వెబ్‌ సైట్ల సేవల్లో అంతరాయం ఏర్పడటంతో పాటు కాలిఫోర్నియాల్లో కూడా అనేక వెబ్‌ సైట్ల సేవలు ఆగిపోయాయి. ఇదే క్రమంలో యూరప్‌ లో కూడా నెట్‌ ఫ్లిక్స్ - ట్విటర్ వంటి వైబ్‌ సైట్లు నిలిచిపోయాయి.

ఈ సమయంలో స్పందించిన డైన్ సంస్థ అదికారులు మాట్లాడుతూ... హ్యాకర్లు చాలా తెలివిగా దాడి చేశారని, తాము సమస్యను పరిష్కరించగానే మళ్లీ దాడి మొదలుపెట్టేవారని, అలా చాలా సార్లు జరిగిందని అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింతగా తీవ్రవమడంతో రంగంలోకి దిగిన అమెరికా అంతర్గత భద్రతా అధికారులు - పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పరిస్థితిని ప్రస్తుతానికైతే అదుపులోకి తెచ్చామని, అన్ని సైట్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని డైన్ కంపెనీ ప్రకటించింది. అయితే సులువుగా వాడే మిరాయ్ ప్రోగ్రాం ఆధారంగా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారని, హ్యాకర్లు వినియోగించే డార్క్ వెబ్‌ లో మిరాయ్ ప్రోగ్రాం కోడ్ ఎప్పటినుంచో అందుబాటులో ఉందని నిపుణులు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/