Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 30 మంది బలి

By:  Tupaki Desk   |   18 Oct 2016 4:13 AM GMT
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 30 మంది బలి
X
దారుణం జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం 30 మందిని బలి తీసుకుంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులు డయాలసిస్ చేసుకుంటున్న చోట.. ఉన్నట్లుండి చెలరేగిన మంటల్లో చిక్కుకుపోయారు. చేతికి వైర్లు అడ్డుపడగా.. వాటిని తీసి అక్కడి నుంచి తప్పించుకుందామనుకున్నంతలో మంటల్లో చిక్కుకొని.. నిస్సహాయంగా సజీవ దహనమైపోయారు. విన్నంతనే ఒళ్లు జలదరించే ఈ దారుణం సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొలుత24 మంది మరణించినట్లు భావించినా.. అనంతరం గాయపడిన వారితో కలిపి 30 మంది రోగులు మరణించినట్లుగా చెబుతున్నారు.

భువనేశ్వర్ లోనే అతి పెద్ద ప్రైవేటు ఆసుపత్రిగా చెప్పే ‘‘సమ్’’లో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం అందరికి షాకింగ్ గా మారింది. తొలుత డయాలసిస్ వార్డులో చెలరేగిన మంటలు.. తర్వాత ఐసీయూకి వ్యాపించటంతో పేషంట్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఆసుపత్రి సిబ్బంది.. ఇతర వార్డుల్లోని పేషంట్లు.. అగ్నిమాపక సిబ్బంది చురుగ్గా వ్యవహరించి ఇతర వార్డుల్లోని పేషంట్లను సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆసుపత్రిలో దాదాపు 500 మంది వరకు పేషంట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రాధమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే.. వివిధ మార్గాల్లో రోగుల్ని బయటకు తీసుకొచ్చిన ఆసుపత్రి సిబ్బంది.. అధికారులు వెంటనే చుట్టుపక్కల ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందేలా చేశారు. జరిగిన దారుణ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ఒడిశా సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడేం చేసినా.. జరిగిన దారుణంలో ప్రాణాలు కోల్పోయిన వారైతే తిరిగి రాలేని పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/