Begin typing your search above and press return to search.

విశాఖ హెచ్.పీ.సీఎల్ భారీ అగ్నిప్రమాదం.. జనం పరుగులు

By:  Tupaki Desk   |   25 May 2021 12:40 PM GMT
విశాఖ హెచ్.పీ.సీఎల్ భారీ అగ్నిప్రమాదం.. జనం పరుగులు
X
విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పీ.సీఎల్) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించింది. ఫ్యాక్టరీలో సైరన్లు మోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించేశారు.

హెచ్.పీ.సీఎల్ లో భారీగా మంటలు పొగ వస్తుండడంతో ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్.పీ.సీఎల్ రసాయనాలు ఉపయోగించి మంటలను అదుపు చేస్తోంది.

హెచ్.పీ.సీఎల్ రిఫైనరీలో మొదట రెండు సార్లు భారీ శబ్ధాలు వచ్చాయని స్పాట్లో ఉన్నకార్మికులు చెబుతున్నారు. ఈ ఘటనతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంధనం నిల్వ చేసే పెద్ద ట్యాంక్ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముడిచమురు ప్రాసెస్ సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం. అయితే తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగిసిపడడం వల్ల భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నాయి.

తాజా ప్రమాదం హెచ్.పీ.సీఎల్ సీడీయూ మూడో యూనిట్లో జరిగిందంటున్నారు. అతి ఎక్కువగా మండే పదార్థాలు ఇక్కడే ఉంటాయంటున్నారు. ప్రమాద సమయంలో ఏడుగురు సిబ్బందితోపాటు మరికొందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హెచ్.పీ.సీఎల్ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.