Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ హిందీలో ఫెయిల్‌!

By:  Tupaki Desk   |   5 Oct 2017 9:47 AM GMT
మోడీ బ్యాచ్  హిందీలో ఫెయిల్‌!
X
జాతీయ భాష‌గా హిందీ ఉన్న‌ప్ప‌టికీ.. దాన్ని దేశ ప్ర‌జ‌లంతా ఓకే చేస్తారా? అంటే లేద‌ని చెప్పాలి. హిందీని వీలైనంత‌గా పాపుల‌ర్ చేయాల‌ని మోడీ ప‌రివారం సంక‌ల్పంగా తీసుకున్నా.. అమ‌లుకు వ‌చ్చేస‌రికి మాత్రం సాధ్యం కాని ప‌రిస్థితి. భావోద్వేగాల‌తో ముడిప‌డి ఉన్న భాష‌ను ప్ర‌జ‌ల్లో బ‌ల‌వంతంగా ఎక్కించాల‌న్న మోడీ స‌ర్కారు వ్యూహం ప‌లు రాష్ట్రాల్లో ఎదురు తిరిగింది.

త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాల్లో అయితే మొద‌టికే మోసం వ‌చ్చిన ప‌రిస్థితి. త‌మ‌కే మాత్రం ఇష్టం లేని హిందీని త‌మ మీద ఎలా రుద్దుతారంటూ త‌మిళులు మోడీ బ్యాచ్ మీద పీక‌ల దాకా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. ఒక్క త‌మిళ‌నాడులోనే కాదు.. భాషాభిమానం ఎక్కువ‌గా ఉన్న ప్ర‌తి చోటా ఇదే ప‌రిస్థితి. హిందీని ఏదోలా ప్ర‌మోట్ చేయ‌టానికి మోడీ బ్యాచ్ ప‌డిన పాట్లు అన్ని ఇన్ని కావు.

గ‌డిచిన మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో మోడీ బ్యాచ్ హిందీ విష‌యంలో సాధించిందేమిటి? మిగిలిన వారి సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. హిందీ మంత్రులు నిర్వ‌హిస్తున్న శాఖ‌ల్లో హిందీ వినియోగం ఎలా ఉంద‌న్న అంశంపై ఓ స‌మీక్ష‌ను నిర్వ‌హించిన‌ట్లుగా తెలుస్తోంది. హోం.. నీతి అయోగ్‌.. ఐబీతో పాటు దాదాపు 20 శాఖల్లో హిందీ వినియోగం మీద ఒక స‌మీక్ష నిర్వ‌హించారు. ఇందులో ఉమాభార‌తి నిర్వ‌హించిన జ‌ల‌వ‌న‌రుల శాఖ ఒక్క‌టే హిందీ విష‌యంలో స‌క్సెస్ కాగా మిగిలిన వారంతా అడ్డంగా ఫెయిల్ కావ‌టం క‌నిపించింది.

ఉమాభార‌తికి సంబంధించిన శాఖ‌లో ఫైల్ నోటింగ్‌ ల‌లో దాదాపు 58 శాతం హిందీలో అవుతుండ‌గా.. 44 మంది అధికారుల్లో 40 మంది ప‌ని వేళ‌ల్లో హిందీలోనే మాట్లాడుతుండ‌టం గ‌మ‌నార్హం.మిగిలిన శాఖ‌ల్లో మాత్రం ఇలాంటి ప‌రిస్థితి లేదంటున్నారు. ఎందుకిలా అంటే.. ఆఫీసులో ఉన్న‌ప్పుడు ఉమాభార‌తి హిందీలో మాట్లాడ‌ట‌మే అస‌లు కార‌ణంగా చెబుతున్నారు. కీల‌క‌మైన హోం శాఖ‌లోని 112 మంది సీనియ‌ర్ అధికారులు త‌మ‌కు హిందీ వ‌చ్చున‌ని చెప్పినా.. ప్రాక్టిక‌ల్ గా వినియోగించే విష‌యంలో 49 మంది 30 శాతం కంటే త‌క్కువ‌గా హిందీని వినియోగించిన తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 55 శాతం ఫైల్ నోటింగ్స్ హిందీలో జ‌రుగుతున్నా.. వాటికి బ‌దులు రాసే స‌మ‌యంలో మాత్రం ఇంగ్లిషులో స‌మాధానం ఇస్తున్న వైనాన్ని గుర్తించారు.

నీతి ఆయోగ్ లోని 59 మంది అధికారుల్లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా హిందీ మాట్లాడ‌టం లేద‌ని తెలుస్తోంది. త‌మ విభాగంలో టెక్నిక‌ల్ స‌ర్వీసులు ఇచ్చే వారు ఉండ‌టంతో హిందీ వినియోగించ‌టం త‌క్కువ‌గా ఉంద‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌లోనూ ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు ఎక్కువ‌గా ఉండ‌టంతో హిందీయేత‌ర భాష‌నే ఎక్కువ‌గా వాడుతున్న‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. హిందీని ప్ర‌మోట్ చేసే ప‌ని మంత్రుల మీద ప‌డితే వారు సైతం లైట్ తీసుకుంటున్న విష‌యం మోడీకి తెలిస్తే? త‌మ‌కేమాత్రం సంబంధం లేని హిందీని వాడాలంటూ కేంద్ర‌మంత్రులు అదే ప‌నిగా స్పీచ్ ఇస్తున్నారే త‌ప్పించి.. త‌మ విభాగాల్లో మాత్రం ఆ దిశ‌గా ప‌ని చేయ‌టం లేద‌ని చెబుతున్నారు. ఇల్లు చ‌క్క‌దిద్దుకున్నాక బ‌జారుకు రావాల్సిన విష‌యాన్ని హిందీ భాష ను ప్ర‌మోట్ చేసే వారు ఇప్ప‌టికైనా గుర్తిస్తే ఆ భాష‌కు మంచి జ‌ర‌గ‌టం ఖాయం. లేదంటే.. ఎప్ప‌టి మాదిరే హిందీ మ‌న‌ది కాద‌న్న మాట దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోతుందంతే.