Begin typing your search above and press return to search.

సోనియాను ఓడించేందుకు బీజేపీ అస్త్రం ఈయనే..

By:  Tupaki Desk   |   27 March 2019 8:10 AM GMT
సోనియాను ఓడించేందుకు బీజేపీ అస్త్రం ఈయనే..
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి బీజేపీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సోనియాపై దేశభక్తి కార్డును తీయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సోనియాగాంధీ ఎంపీగా పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి స్థానం నుంచి మాజీ ఆర్మీ మేజర్ సురేంద్ర పునియాను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ డిసైడ్ అయ్యింది.

తాజాగా బీజేపీలో చేరిన ఆర్మీ మాజీ మేజర్ సురేంద్ర పునియా తాను రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి సోనియాగాంధీపై పోటీచేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. మోడీ కోరిక మేరకు తాను రాయబరేలీలో పోటీ చేస్తున్నానని.. మోడీ నాకిచ్చే గౌరవంగా ఇది భావిస్తున్నానని.. రాయబరేలీలో ఎన్నికల పోరు చౌకీదారు, చోర్ ల మధ్య సాగుతుందని మాజీ మేజర్ పూనియా తెలిపారు. దేశభక్తి సెంటిమెంట్ తో సురేంద్ర పునియాను రంగంలోకి దించి నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రజాదరణ ఉన్న వ్యక్తులకు గాలం వీస్తోంది.

2004 నుంచి వరుసగా సోనియాగాంధీ రాయబరేలీ నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఈ పార్లమెంట్ సీటు ఆమెకు కంచుకోటగా మారింది. వరుస విజయాలతో ఇక్కడ ప్రత్యర్థులను సోనియా మట్టి కరిపిస్తున్నారు. దీంతో బీజేపీ ఆమెపై సరైన ప్రత్యర్థిగా భారత సైన్యంలో ప్రత్యేక దళానికి మేజర్ గా పనిచేసి మోడీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన పూనియాకు గాలం వేసింది. మార్చి 23న పూనియా బీజేపీ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా - రాంలాల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు సోనియాపై పోటీకి రెడీ అయ్యారు.

భారత సైన్యంలో మేజర్ గా చేసిన పూనియా విశిష్ట సేవలు చేశారు. ఈయన సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవా మెడల్ లభించింది. పలు అంతర్జాతీయ అవార్డులు కూడా పొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూనియా రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ స్థానం నుంచి పోటీచేశారు.