Begin typing your search above and press return to search.

బ‌రిలో 185 మంది!... అయినా ఈవీఎంతోనే పోలింగ్‌!

By:  Tupaki Desk   |   31 March 2019 5:46 PM GMT
బ‌రిలో 185 మంది!... అయినా ఈవీఎంతోనే పోలింగ్‌!
X
ఈ ఎన్నిక‌లు నిజంగానే ప్ర‌త్యేక‌మైన‌వ‌నే చెప్పాలి. ఇటు రాజ‌కీయ పార్టీల‌తో పాటు అటు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను భుజానికెత్తుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌దైన కొత్త నిర్ణ‌యాల‌కు శ్రీ‌కారం చుడుతోంది. గతంలో ఎన్న‌డూ లేనంత హైరేంజి ఎన్నిక‌లుగా 2019 ఎన్నిక‌ల‌ను విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్న విష‌యం తెలిసిందే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం - ఎక్క‌డి ప‌రిస్థితికి అక్క‌డి పార్టీల భిన్న వ్యూహాల‌తో రంగంలోకి దిగిన పార్టీలు... ఓ నియోజవ‌ర్గంలో అనుస‌రిస్తున్న వ్యూహాన్ని దాని ప‌క్క‌నే ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌లు చేసేందుకు సాహ‌సించ‌డం లేదు. ఈ లెక్క‌న మేనిఫెస్టోలు రావాలంటే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కో మేనిఫెస్టో త‌యారు చేసే ప‌నిలో పార్టీలు క‌స‌రత్తులు మొద‌లెట్టేశాయి.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంపై ఒక్కో త‌ర‌హా నిఘాను రంగంలోకి దించుతోంది. ఇలాంటి ప‌రిణామాల్లో అత్యంత ఆస‌క్తి క‌లిగించిన నిజామాబాద్ ఎంపీ సీటుకు జ‌రగ‌నున్న పోలింగ్ కు ఈసీ చాలా కొత్త నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పాలి. కేసీఆర్ స‌ర్కారు - సిట్టింగ్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత గిట్టుబాటు ధ‌ర‌ల విష‌యాన్ని ప‌ట్టించుకోలేద‌న్న కోపంతో ఏకంగా వంద మందికి పైగా రైతులు ఆమెకు పోటీగా నామినేష‌న్లు వేశారు. వారి నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించేందుకు టీఆర్ ఎస్ చేసిన య‌త్నాలు బెడిసికొట్టాయి. దీంతో నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసిన త‌ర్వాత బ‌రిలో క‌విత‌తో పాటు మొత్తం 185 మంది బ‌రిలో నిలిచిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం తేల్చింది.

పోటీలో 90 మందికి పైగా అభ్య‌ర్థులు ఉంటే... ఈవీఎంకు బ‌దులుగా పేప‌ర్ బ్యాలెట్ తోనే పోలింగ్ నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల నియ‌మావ‌ళి చెబుతోంది. అయితే ఆ నియ‌మావ‌ళిని పక్క‌న‌పెట్టేసిన ఈసీ... 185 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్న నిజామాబాద్ పోలింగ్ ను కూడా ఈవీఎంల ద్వారానే నిర్వ‌హించాల‌ని తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు 26,820 - బ్యాలెట్ యూనిట్లు -- 21240 కంట్రోల్ యూనిట్లను - 2600 వీవీ ప్యాట్లను సరఫరా చేయాలని ఈసీఐఎల్‌ ని ఈసీ ఆదేశించింది. మొత్తంగా ఈసీ తీసుకున్న ఈ నిర్ణ‌యం క‌విత‌కు ఎలాంటి ఇబ్బంది తెచ్చిపెడుతుందోన‌న్న వాద‌న వినిపిస్తోంది.