Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ః ప్ర‌తిప‌క్షంలో ఇంకో ప్ర‌తిప‌క్షం విలీనం

By:  Tupaki Desk   |   1 July 2016 4:03 AM GMT
ఇంట్రెస్టింగ్ః ప్ర‌తిప‌క్షంలో ఇంకో ప్ర‌తిప‌క్షం విలీనం
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. అమ్మ జ‌య‌లలిత నేతృత్వంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇన్నాళ్లు క‌లిసి పోరాటం చేయ‌గా...ఇపుడు విలీనం బాట ప‌ట్టాయి. ప్ర‌తిప‌క్ష డీఎంకేలో త‌మ పార్టీని విలీనం చేస్తున్నామని మక్కళ్‌ డీఎండీకే కన్వీనర్ చంద్రకుమార్ తాజాగా ప్రకటించారు. కెప్టెన్ విజ‌య‌కాంత్‌ కు చెంది డీఎండీకే చీలిక వ‌ర్గ‌మే మ‌క్క‌ళ్ డీఎండీకే. విజయకాంత్‌ వైఖరి నచ్చక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామే కానీ తామెప్పుడూ డీఎండీకే నాయకులమేనని శాసనసభ ఎన్నికలకు ముందు పదే పదే పేర్కొన్న చంద్రకుమార్‌ ఆ తర్వాత ‘మక్కళ్‌ డీఎండీకే’ను ప్రారంభించడం, డీఎంకేతో పొత్తుపెట్టుకోవడం వంటి పరిణామాలు వెనువెంటనే జరిగిపోయాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి మూడు స్థానాలు పొంది పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. దీంతో పార్టీని డీఎంకేలో విలీనం చేయాలని నిర్ణయించారు.

చెన్నై గోపాలపురంలోని నివాసంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని మ‌క్క‌ళ్ డీఎండీకే క‌న్వీన‌ర్‌ చంద్రకుమార్‌ - ఆ పార్టీ నేతలు పార్తిబన్‌ - సీహెచ్‌ శేఖర్‌ తదితరులు కలిసి తమ పార్టీని డీఎంకేలో విలీనం చేస్తామని ఆమోదించాలని కోరుతూ కరుణానిధికి లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ మక్కళ్‌ డీఎండీకేను రద్దు చేయలేదని డీఎంకేలో విలీనం చేస్తున్నామని వివరించారు. తాను, పార్టీ కీలక నేతలు పార్తిబన్‌ - సీహెచ్‌ శేఖర్‌ - తేని మురుగేశన్‌ - సెంజి శివ - కార్తి - విశ్వనాథన్‌ - శివకుమార్‌ - సెంథిల్‌ కుమార్‌ - రాజా - వేల్‌ మురుగన్‌ తదితరులు డీఎంకేలో విలీనమవడానికి నిర్ణయించామన్నారు. ఇందుకు సేలంలో జులై 17న భారీ విలీనసభ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో డీఎండీకే అసమ్మతి నాయకులు - కార్యకర్తలు కూడా డీఎంకేలో చేరనున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం డీఎండీకే పరిస్థితి గందరగోళంగా ఉందని - పార్టీ నాయకులు - కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి జిల్లాలవారీగా డీఎండీకేలోని అసమ్మతి నేతలను గుర్తించి డీఎంకేలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ ను డీఎంకేలోకి ఎవరూ ఆహ్వానించడం లేదని, ఇప్పటికే ఆ పార్టీలోని అత్యధికులు డీఎంకే గూటికి చేరారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయకాంత్‌ ను పట్టించుకునేవారేలేరని ఎద్దేవా చేశారు. ఇదిలాఉండ‌గా వామ‌ప‌క్షాల‌తో క‌లిసి కూటమి ఏర్పాటు చేయాల‌నే కెప్టెన్‌ నిర్ణయంతో డీఎండీకే పార్టీ నిలువునా చీలి 10 మంది జిల్లా కార్యదర్శులు - ముగ్గురు శాసనసభ్యులు వేరుపడి ‘మక్కళ్‌ డీఎండీకే’ను ప్రారంభించారు. ఈ ప‌రిణామంతో కెప్టెన్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 25 లక్షల ఓటుబ్యాంకు ఉన్న పార్టీకి 10 లక్షల ఓట్లు మాత్రమే దక్కడం ఇందుకు నిదర్శనం.