Begin typing your search above and press return to search.

విశ్వనాయకుడి సంచలనం.. ఓవైసీతో జత కట్టేందుకు రెఢీ

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:06 AM GMT
విశ్వనాయకుడి సంచలనం.. ఓవైసీతో జత కట్టేందుకు రెఢీ
X
హైదరాబాద్ మహానగరంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (పటాన్ చెరువును కూడా కలుపుకొని) కేవలం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన మజ్లిస్.. గడిచిన కొన్నేళ్లుగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు వీలుగా ప్లాన్ చేయటం తెలిసిందే. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తన సత్తా చాటింది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అందరిని విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తో జత కట్టేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీ సిద్ధమవుతోంది. ఈ కాంబినేషన్ రానున్న ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాల్ని రాబడుతుందన్న అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. తమిళనాడులోని మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండే వెల్లూర్.. రాణీపేట్.. తిరపత్తూర్.. క్రిష్ణగిరి.. రామనాథపురం.. పుదుకొట్టై.. తిరుచ్చి.. మధురై.. తిరువల్వేలి జిల్లాల్లో కనీసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్లలే తాజాగా అసద్.. తమిళనాడు ఆఫీస్ బేరర్లతో భేటీ అయినట్లు చెబుతున్నారు. తమిళనాడులో పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు.. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారు మాట్లాడుతున్నారు. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 5.8 శాతం ఉంటుందని.. ఇలాంటివేళ.. కమల్.. మజ్లిస్ రెండు కలిసి బరిలోకి దిగితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం ఖయమంటున్నారు. అయితే.. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉందే తప్పించి.. ముందుకు వెళ్లలేదంటున్నారు. అయితే.. విశ్వనాయకుడితో జత కడితే తమకు వచ్చే లాభనష్టాల గురించి ఓవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. వీరి కాంబినేషన్ ఏ మేరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.