Begin typing your search above and press return to search.

2 రోజున ఐటీ సోదాలు.. మల్లారెడ్డి కుమారుడికి ఛాతీ నొప్పి.. ఇప్పుడు ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:06 AM GMT
2 రోజున ఐటీ సోదాలు.. మల్లారెడ్డి కుమారుడికి ఛాతీ నొప్పి.. ఇప్పుడు ఎక్కడంటే?
X
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంపన్నులైన రాజకీయ నేతల్లో మంత్రి మల్లారెడ్డి ఒకరన్న సంగతి తెలిసిందే. ఆయనకు పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు.. నాలుగు మెడికల్ కాలేజీలు.. ఆసుపత్రి.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఆస్తులు.. వ్యాపారాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడన్న పేరున్న మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు అనూహ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్న (మంగళవారం) తెల్లవారుజామున ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ.. బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించటం.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను.. నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధవారం) ఉదయం నుంచి సోదాల కార్యక్రమం మొదలైంది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు.. బంధువులతో పాటు.. వ్యాపార భాగస్వాములు.. వారికి సంబంధించిన వారి ఇళ్లల్లోనూ సోదాలు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఐటీ సోదాలు మొదలైన కాసేపటికే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీ నొప్పికి గురైనట్లుగా చెబుతున్నారు.

దీంతో.. ఆయన్ను హుటాహుటిన సురారంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండో రోజు కూడా దాదాపు యాభై టీంలు ఏకకాలంలో మంత్రి మల్లారెడ్డి వ్యాపార సామ్రాజ్యంతో పాటు.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి వద్ద సోదాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐటీ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మంత్రిమల్లారెడ్డి అభిమానులు.. సానుభూతిపరులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం.. మోడీ దిష్టిబొమ్మను దగ్థం చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో.. అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీసులతో పాటు 30 మంది సీఆర్ఫీఎఫ్ సిబ్బందిని భద్రత కోసం రంగంలోకి దించారు. ఐటీ సోదాల్లో భాగంగా మూడు షిఫ్టుల్లో.. 200 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 46 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతుున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.