Begin typing your search above and press return to search.

పుదుచ్చేరిలో తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలుగోడు

By:  Tupaki Desk   |   6 Jun 2016 10:17 AM GMT
పుదుచ్చేరిలో తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలుగోడు
X
తల్లి విలువ.. ఇంటి ప్రాధాన్యత.. సొంతూరు గొప్పతనం అవి ఉన్నప్పుడు పెద్దగా తెలియవు. ఎప్పుడైతే అవి దూరమవుతాయో వాటి విలువ ఎంతన్నది అర్థమవుతుంది. తెలుగు నేల మీదున్న బతికేసే చాలామంది రాజకీయ నేతలు ప్రమాణస్వీకారాలు చేయాల్సి వస్తే.. ఇంగిలిపీసులో చేసేస్తుంటారు. అదేమంటే తెలుగులో సౌకర్యంగా ఉండదని చెబుతారు. కానీ.. తెలుగునేల మీద లేకున్నా.. తెలుగు మూలాలు తనతో ఉంచుకున్న యానాం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. పుదుచ్చేరి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మల్లాడి కృష్ణారావు తెలుగు భాష మీద తనకున్న మక్కువను ప్రదర్శించారు.

తన మూలాల్ని మర్చిపోని ఆయన.. తన ప్రమాణస్వీకారాన్ని తెలుగు భాషలో చేసి ఆశ్చర్యపరిచారు. తెలుగు నేల మీద రాజకీయాలు చేసే చాలామంది నేతలు ఇంగ్లిషులోనూ.. హిందీలోనూ ప్రమాణస్వీకారం చేస్తే.. అందుకు భిన్నంగా రాష్ట్రం కానీ రాష్ట్రంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో అమ్మ భాష మీద ప్రేమను వ్యక్తం చేయటం చూసినప్పుడు.. మల్లాడి కృష్ణారావుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. తమిళ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు.. తమిళ భాష మీద విపరీతమైన మమకారం చూపించే నేల మీద నిలబడి అమ్మ భాషలో ప్రమాణస్వీకారం చేయటానికి ధైర్యం ఉండాలనే చెప్పాలి.