Begin typing your search above and press return to search.

ఏపీకి ప‌వ‌న్ కాల్షీట్లు ఇచ్చాడంటున్న వైసీపీ నేత‌

By:  Tupaki Desk   |   8 Dec 2017 3:30 PM GMT
ఏపీకి ప‌వ‌న్ కాల్షీట్లు ఇచ్చాడంటున్న వైసీపీ నేత‌
X
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఏపీ ప‌ర్య‌ట‌న‌పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ - మాజీ ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి భారీ సెటైర్ వేశారు. పవన్‌ కళ్యాణ్‌ అవసరానికి మించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫాతిమా కాలేజీ వ్యవహారంపై మూడు నెలలుగా పట్టించుకోకుండా ఈ రోజు పవన్‌ మాట్లాడటం బాధాకరమన్నారు. ఆంధ్ర‌ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ మూడు రోజులు కాల్షిట్లు ఇచ్చారని, అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ నాణానికి ఒకపక్కనే చూస్తున్నారు తప్ప - రెండో పక్క ఎందుకు చూడటం లేదో సమాధానం చెప్పాలని మ‌ల్లాది విష్ణు నిలదీశారు.

వైఎస్‌ఆర్‌ సీపీకి చెందిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి వారితో వైఎస్‌ జగన్‌ ను తిట్టిస్తున్నారని, ఈ విషయంపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని విష్ణు సూటిగా ప్ర‌శ్నించారు. ప్రాజెక్టుల్లో అవినీతి, అధికార ప‌క్ష నేత‌ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని మల్లాది విష్ణు నిలదీశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణలను మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. పోలవరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆది పురుషుడని, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తలోమాట మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ఆస్తుల ప్ర‌క‌ట‌న‌ను విష్ణు ఎద్దేవా చేశారు. లోకేష్‌ ఆస్తుల ప్రకటన అవాస్తవమని, అది బూటకం, నాటమని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని మీడియాకు దూరంగా పెట్టారని, తమకు ఏమీ లేనట్లుగా చంద్రబాబు నటిస్తూ, కొడుకుతో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని విష్ణు అన్నారు. లోకేష్‌ పూర్తిగా అబద్ధాలు - అసత్యాలు మాట్లాడారని, అందుకే డిసెంబర్‌ 8ని అబద్ధాల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను రూ.720 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. `ఆ డబ్బంతా మీది కాదా? అది మీ పెట్టుబడి డబ్బులు కాదా? మీ ఆస్తుల ప్రకటనలో ఈ డబ్బును ఎందుకు చూపించలేదు?` అని లోకేష్‌ ను నిలదీశారు. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి, అర్హత లోకేష్‌కు లేదన్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు పోల‌వ‌రంపై నిల‌దీస్తున్నాడ‌ని...దీనిపై ముందుగా సీఎం చంద్ర‌బాబు స‌మాధానం ఇవ్వాల‌న్నారు.