Begin typing your search above and press return to search.

మహిళ అని చూడకుండా ఆ మాటలేంది విష్ణు?

By:  Tupaki Desk   |   27 Dec 2019 4:21 AM GMT
మహిళ అని చూడకుండా ఆ మాటలేంది విష్ణు?
X
ఇవాల్టి రోజున రాజకీయాల్లో హుందాతనం మిస్ కావటం కొత్తేం కాదు. ఎవరిని ఎవరూ గౌరవించుకోరు. మర్యాద అస్సలు ఇచ్చుకోరు. అంతా దూకుడే. ఒకరికి మించి మరొకరు నోటికొచ్చినట్లు మాట్లాడుకోవటం.. వ్యాఖ్యలు చేసుకోవటం ఇప్పుడో అలవాటుగా మారింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇరిటేట్ కావటం ఒక ఎత్తు అయితే.. బ్యాలెన్స్ మిస్ అయిన మాటలు జారిన వైనం సంచలనంగా మారింది.

ఒక టీవీ చానల్ నిర్వహించిన డిబేట్ ఇందుకు వేదికైంది. మహిళా నేత అని చూడకుండా మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. హాట్ హాట్ గా సాగే చర్చల్లో ఎవరు ఎవరినైనా విమర్శించే వీలుంది. సంధించిన విమర్శల్ని తిప్పి కొట్టాలే కానీ..దుందుడుకుతనంతో విరుచుకుపడటం.. మాటలతో హెచ్చరికలు చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది. రాజధాని అమరావతిపై జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. టీడీపీ నేత పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల్ని ఆమె ప్రస్తావించారు. దీంతో ఆగ్రహానికి గురైన విష్ణు టీడీపీ అధినేత చంద్రబాబును ఉసరవెల్లిగా సంబోధించటంపై ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. గూగుల్ లో ఊసరవెల్లి అని సెర్చ్ చేస్తే ఎవరి పేరు రాదని.. కానీ ఖైదీ నంబరు 6093 అని సెర్చ్ చేస్తే మాత్రం సీఎంజగన్ పేరు వస్తుందని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వాడుగు వాగితే మర్యాద ఉండదని హెచ్చరించటంతో పాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి గౌరవంగా మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో ఓడి.. ప్రజలు చెప్పు తీసుకొని కొడితే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మల్లాది విష్ణు ఆగ్రహానికి ధీటుగా స్పందించిన అనురాధ.. మీ బార్ లో ఏడుగురు చనిపోయారనటంతో జగన్ పార్టీ ఎమ్మెల్యే పూర్తిగా బ్యాలెన్స్ మిస్ అయ్యారు.

నోర్ముయ్.. పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే లోపలేయిస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వటమే కాదు.. నీ స్థాయి ఏంటి? నువ్వేమిటి? అంటూ ఫైర్ కావటమే కాదు ఆడదానివని కూడా చూడనని..నాలుక కట్ అయిపోద్దంటూ మండిపడ్డారు. కార్పొరేటర్ స్థాయికి సరిపోని అనురాధ సీఎంను ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. అదే నిజమైతే.. విష్ణు అలాంటి నేతతో చర్చకు కూర్చోనని ముందే చెబితే సరిపోయేది కదా?

స్థాయిల్ని వదిలేసి.. విమర్శలు చేసినప్పుటు అంతే ఘాటుగా ప్రతి విమర్శ చేయాలే తప్పించి.. ఇలా పవర్ చూపించి వార్నింగ్ లు ఇవ్వటం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లైవ్ లో జరిగిన ఈ హాట్ చర్చలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. వేడెక్కిన వాతావరణాన్ని చల్లార్చటం కోసం డిబేట్ నిర్వహిస్తున్న చానల్ హోస్ట్ సర్ది చెప్పటానికి కిందామీదా పడటం కొసమెరుపుగా చెప్పాలి.