Begin typing your search above and press return to search.

క్యాసినో ప్రవీణ్ కారుకు త‌న స్టిక్క‌ర్‌పై ఆ మంత్రి చెబుతున్న‌దిదే!

By:  Tupaki Desk   |   28 July 2022 8:58 AM GMT
క్యాసినో ప్రవీణ్ కారుకు త‌న స్టిక్క‌ర్‌పై ఆ మంత్రి చెబుతున్న‌దిదే!
X
దేశంలో ప‌లు ప్రాంతాలతోపాటు నేపాల్, శ్రీలంక‌, థాయ్‌లాండ్ తదిత‌ర దేశాల్లో క్యాసినోలు నిర్వ‌హించిన చికోటి ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డిల వ్య‌వ‌హారం రోజురోజుకో ముదురుతోంది. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జ‌రిపిన దాడుల్లో అనేక సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ న‌గ‌రంలో 8 చోట్ల దాడులు చేసిన ఈడీ క్యాసినోల వ్య‌వ‌హారానికి సంబంధించి కీల‌క విష‌యాలు రాబ‌ట్టింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.

కాగా హైద‌రాబాద్ లోని బోయిన‌ప‌ల్లిలో క్యాసినోల నిర్వాహ‌కుడు మాధ‌వ‌రెడ్డి ఇంట్లో సోదాల సంద‌ర్భంగా ఈడీ అనేక విష‌యాల‌ను తెలుసుకుంది. మాధ‌వ‌రెడ్డి త‌న కారుపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డికి చెందిన స్టిక్క‌ర్‌ను అతికించుకుని తిరుగుతున్న‌ట్టు వెల్ల‌డైంది.

ఈ నేపథ్యంలో క్యాసినోల నిర్వాహ‌కుడు మాధ‌వ‌రెడ్డి కారుకు త‌న‌ స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మాధ‌వ‌రెడ్డి కారుపై ఉన్న స్టిక్క‌ర్ తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను ప‌డేసిన స్టిక్క‌ర్ ను ఎవ‌రో వారి కారుపై పెట్టుకుంటే త‌న‌కేమి సంబంధ‌మ‌ని మంత్రి ఎదురు ప్ర‌శ్నించారు. ఆ స్టిక్క‌ర్ ను తాను మూడు నెల‌ల క్రిత‌మే ప‌డేసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.

కాగా బోయినపల్లికి చెందిన ప్ర‌వీణ్ భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లో ఈడీ సోదాల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలు ల‌భించాయ‌ని చెబుతున్నారు.

మరోవైపు.. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్‌, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆగ‌స్టు 1న సోమ‌వారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, హవాలా లావాదేవీలపై ఈడీ.. ప్రవీణ్‌, మాధ‌వ‌రెడ్డిల‌ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరిద్ద‌రితో సంబంధ‌మున్న రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినిమా తారలు, అధికారులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా సోదాల్లో ఈడీ.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిలో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, అధికారులు కూడా ఉన్నార‌ని స‌మాచారం.