Begin typing your search above and press return to search.

పేరు మార్చుకుంటే.. జాతీయ పార్టీనా? : టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ స‌టైర్లు

By:  Tupaki Desk   |   8 Oct 2022 5:30 PM GMT
పేరు మార్చుకుంటే.. జాతీయ పార్టీనా? :  టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ స‌టైర్లు
X
ప్రాంతీయ పార్టీలు పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీలు అయిపోవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జునఖర్గే స‌టైర్లు పేల్చారు. టీఆర్ ఎస్‌ జాతీయ పార్టీగా మారుతు న్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఖర్గే.. పార్టీ ప్రతినిధుల మద్దతు కోసం తెలంగాణ‌కు వచ్చారు. దీనిలో భాగంగా గాంధీభవన్లో పీసీసీ ప్రతినిధులతో ఖర్గే సమావేశమయ్యారు.

మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ పార్టీలో ఎన్నిక జరుగుతుందని.. బీజేపీ చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదన్నారు. మోడీ, అమిత్‌షా దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. తొమ్మిది వేలకు పైగా ఉన్న ఓటర్లను తాను నేరుగా కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటించి, కాంగ్రెస్ ఓటర్లను అభ్యర్థించానని పేర్కొన్నారు.

138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్లో నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయన్నారు. ఇప్పుడు ఐదోసారి.. తాను బరిలో దిగానని తెలిపారు. ఈ క్రమంలోనే ఉదయ్పూర్ చింతన్ బైటక్లో తీసుకున్న డిక్లరేషన్ను అమలు చేస్తానన్న ఖర్గే.. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామన్నారు. శశిథరూర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇందులో ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు.

``మోడీ, అమిత్‌షా కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 60 ఏళ్లలో ఏం చేశారంటున్నారు. మేము దేశాన్ని ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దాం. ప్రాజెక్టులు నిర్మించాం.పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశాం. బీజేపీ, దాని వెనక ఉన్న ఆర్ఎస్ఎస్‌ కలిసి మేము నెలకొల్పిన వాటిని ఒకదాని తర్వాత మరొకదాన్ని అమ్మేస్తూ వస్తున్నారు. కొందరిని కుబేరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రూపాయి విలువ 82.82కి పడిపోయింది`` అని ఖ‌ర్గే దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్‌ హయాంలో రూ.414గా ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇవాళ రూ.1,100ల‌కు చేరింద‌న్నారు. మ హిళలకు ఉచితంగా ఇచ్చే పథకాలనూ లేకుండా చేశార‌ని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని, ఇలాంటి ధోరణులపై పోరాడేందుకే తాను నిలబడుతున్నానని ఖ‌ర్గే వివ‌రించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.