Begin typing your search above and press return to search.

హోదాపై నోటీసు : చర్చకు వస్తే చిక్కులే!

By:  Tupaki Desk   |   8 Feb 2018 9:58 AM GMT
హోదాపై నోటీసు : చర్చకు వస్తే చిక్కులే!
X
కేంద్రప్రభుత్వానికి ఇరకాటమైన పరిస్థితి ఎదురు కాబోతోంది. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి అనుకూలంగా మాట్లాడడానికి యాక్టివేట్ అయింది. నిజానికి తాము చేసిన ద్రోహాన్ని కొంతమేరకైనా దిద్దుకోవడానికి, తద్వారా ఏపీలో కనీసంగానైనా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇదివరలో కనీసం ప్రయత్నం కూడా చేయలదేన్నది అందరికీ తెలుసు. పైగా కీలకమైన లోక్ సభలో ఏపీ నుంచి ఆ పార్టీకి సభ్యులే లేకపోవడంతో.. అసలు జరుగుతున్న అన్యాయం గురించి అడిగే దిక్కులేకుండాపోయింది. కానీ ఇన్ని రోజులుగా ఏపీకి చెందిన అన్ని పార్టీల సభ్యులు నిరసనలు చెబుతున్న తీరు కాంగ్రెస్ లో కదలిక తెచ్చినట్లుంది. పైగా నిన్న ఆంధ్రకు అన్యాయం మొత్తం కాంగ్రెస్ వల్లనే జరిగిందని మోడీ ఆరోపించిన వైనం కూడా రోషం తెప్పించినట్టుంది. పర్యవసానంగా ‘విభజన హామీలు- ప్రత్యేకహోదా’ అంశంపై కాంగ్రెస్ లోక్ సభలో చర్చకు నోటీసు ఇచ్చింది. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే 184 వ సెక్షన్ కింద ఓటింగ్ జరిగేలాగా చర్చ సాగాలని ఈ నోటీసు ఇచ్చారు.

ఇప్పుడు కేంద్రం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రధాన ప్రతిపక్షమే ఫ్లోర్ లీడరే నోటీసు ఇచ్చిన తర్వాత.. దాన్ని తిరస్కరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు.

విభజన హామీలు- ప్రత్యేకహోదా అనే అంశం మీద చర్చకు అనుమతిస్తే గనుక.. భాజపా పెద్దలు ఆడుతున్న డ్రామాలన్నీ బయటకు వస్తాయి. ప్రత్యేకహోదాను పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం - ఎన్నికల సభల్లో పదేపదే హామీలివ్వ డం ఇవన్నీ చర్చకు వస్తాయి. సభా సాక్షిగా అప్పట్లో ఎవరు ఎలా మాట్లాడారో.. ఇప్పుడు ఎలా మాట మారుస్తున్నారో మొత్తం తేలుతుంది. జీఎస్టీ తర్వాత.. హోదా కు చాన్సే లేదని ఏపీ డిమాండును సైడ్ లైన్ చేసిన వారు.. జీఎస్టీ తర్వాత కూడా ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు ఎలా ప్రత్యేకహోదా ఇస్తున్నారో అన్ని అంశాలూ చర్చకు వస్తాయి. ఈ నోటీసు మీద ఓటింగ్ కూడా జరిగితే.. ప్రభుత్వం ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదని.. ఏపీ డిమాండులో వాస్తవం ఉన్నదని భావించేవారు దీనికి అనుకూలంగా ఓటు వేస్తారని పలువురు భావిస్తున్నారు.