Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ కు షాక్‌..ఆయ‌న‌కే సీఎల్పీ ప‌ద‌వి

By:  Tupaki Desk   |   11 Jan 2019 8:22 AM GMT
ఉత్త‌మ్‌ కు షాక్‌..ఆయ‌న‌కే సీఎల్పీ ప‌ద‌వి
X
శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈనెల 15 లేదా 16న జరగనున్న సీఎల్పీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. అనేక మంది నేత‌లు ఈ ప‌ద‌విపై ఆశ పెట్టుకున్న‌ప్ప‌టికీ మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మల్లు భట్టివిక్రమార్క వైపే కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపుతోందని స‌మాచారం. ప్ర‌ధానంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డికి ఈ మేర‌కు షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో శాసనభకు కాంగ్రెస్‌ తరపున 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు - మూడు రోజుల్లో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్‌ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహించి ఈ సందర్భంగా సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోనున్నార‌ని తెలుస్తోంది. ఎన్నికతో పాటు - సీఎల్పీ కార్యవర్గాన్ని కూడా నియమించుకునే అవకాశాలు ఉన్నాయి.

పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క - సీనియ‌ర్ ఎమ్మెల్యేలైన శ్రీ‌ధ‌ర్ బాబు - గండ్ర వెంక‌ట‌ర‌మణారెడ్డి - కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌దిత‌రులు పీసీసీ ప‌ద‌విని ఆశిస్తున్నారు. ప్ర‌ధానంగా భ‌ట్టి - ఉత్త‌మ్ మ‌ధ్య పోటీ ఉంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎల్పీ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనప్పటికీ ఆయన ఆ పదవిని వదలకపోగా...మరో కీలకమైన పదవి అడగటం పట్ల అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అదే సామాజికవర్గానికి చెందిన సబితాఇంద్రారెడ్డి - రాజగోపాల్‌ రెడ్డిలకు ఇచ్చేందుకు అధిష్టానం ససేమిరా అంటుందని గాంధీభవన్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముందస్తు ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మెన్‌ గా వ్యవహరించిన విక్రమార్క దళిత సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో ఆయన చీప్‌ విఫ్‌ గా - డిప్యూటీ స్పీకర్‌ గా పని చేసిన అనుభవం కూడా ఉన్నది. అంతే కాకుండా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉండి - పార్టీ అనుబంధ సంఘాలకు ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఆయనకు ఏఐసీసీ జాతీయ నేత కొప్పుల రాజు అండదండలున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి రామచంద్రకుంతియా మాత్రం ఉత్తమ్‌ కు అనుకూలంగా ఉన్నట్టు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దుబాయ్ టూర్ త‌ర్వాత ఈ మేర‌కు ఓ కొలిక్కి రానున్న‌ట్లు స‌మాచారం.