Begin typing your search above and press return to search.

పవన్ పక్కనున్న ఈ ‘మల్లుల సురేష్’ ఎవరు?

By:  Tupaki Desk   |   16 Oct 2016 5:46 AM GMT
పవన్ పక్కనున్న ఈ ‘మల్లుల సురేష్’ ఎవరు?
X
ప్రత్యేక హోదా మీద గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తిరుపతి.. కాకినాడలలో సభల్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం.. ఆయన కామ్ గా ఉండిపోయారు. తన పనిలో తాను మునిగిపోయారు. కొత్త సినిమాకు సంబంధించిన విషయాల్లో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటివేళ.. శనివారం సాయంత్రం నాలుగైదు గంటల మధ్యలో పవన్ కల్యాణ్ ఒక్కసారి టీవీ తెర మీద దర్శనమిచ్చారు. ఆయన్ను క‌లిసిన‌ పలువురు మహిళలు.. మరికొందరు పురుషులు తమ గోడు వెళ్లబోసుకుంటున్న అంశం టీవీల్లో ప్రసారమైంది.

అప్పటివరకూ జిల్లా పత్రికల్లోనూ.. సోషల్ మీడియాలో మాత్రమే వినిపించే గోదావరి మెగా ఫుడ్ పార్క్ కు సంబంధించి విషయంపై పవన్ రియాక్ట్ కావటం చాలామందికి ఆసక్తిని.. ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే.. దాదాపు ఏడాది నుంచి ఈ ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు.. మహిళలు పోరాటాలు చేస్తున్నా.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకూ అక్కడికి వెళ్లింది లేదు. ఆ ఇష్యూ మీద మాట్లాడింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా జనసేన అధినేత.. ఆ బాధితులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయటం.. ఫుడ్ పార్క్ విషయంలో ఏపీ సర్కారు పునరాలోచించుకోవాలన్న మాటను పవన్ చెప్పేశారు.

ఈ సందర్భంగా పవన్ కు ఒక వ్యక్తి ఫుడ్ పార్క్ వ్యవహారం గురించి వివరంగా చెప్పటం కనిపించింది. పవన్ మాట్లాడటానికి ముందు.. ఫుడ్ పార్క్ కారణంగా ఏర్పడే సమస్యలు.. ఫుడ్ పార్క్ ఏర్పాటులో చోటు చేసుకున్న ఆక్రమాలు.. నిబంధనల ఉల్లంఘనలు లాంటివి ఒక యువకుడు చెప్పటం కనిపించింది. మాసిన గడ్డంతో.. బొద్దుగా ఉన్న ఆ వ్యక్తిని మల్లుల సురేశ్ గా మీడియాకు పరిచయం చేశారు. పవన్ లాంటి వ్యక్తి సీన్లోకి రావటానికి.. అక్వాఫుడ్ పార్క్ గురించి గళం విప్పటానికి.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించటంతో పాటు.. ఈ వ్యవహారాన్ని మరో నందిగ్రామ్ చేయొద్దంటూ తీవ్ర వ్యాఖ్య చేయటానికి కారణం మల్లుల సురేశే. వాస్తవానికి మీడియాకు ఈ మల్లుల సురేశ్ సుపరిచితుడు.

ఎందుకంటే.. అతడి బ్యాక్ గ్రౌండ్ జర్నలిస్టు కావటమే. గ్రామీణ స్థాయి విలేకరిగా ఈనాడు దినపత్రికలో కెరీర్ స్టార్ట్ చేసిన సురేశ్.. తర్వాతి కాలంలో సంస్థ జిల్లా ప్రతినిధిగా శ్రీకాకుళంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో.. అక్కడి రాజకీయ నేతలకు వణుకు పుట్టించిన ఈ యువకుడు.. అవినీతి అంటే చాలు విరుచుకుపడతారు. గిరిజనులు హక్కుల కోసం పోరాటం చేయటమేకాదు.. మాజీ మంత్రి ధర్మాన ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసిన కన్నెధార ఇష్యూ ను తెర మీదకు తీసుకురావటంలో సురేశ్ కీలకభూమిక పోషించారు. జర్నలిస్టుగా సమాజానికి ఏం చేయాలో అది చేయటానికి నిత్యం తహతహలాడే అతన్ని బదిలీ మీద హైదరాబాద్ తీసుకొచ్చారు.

జర్నలిస్టు మిత్రుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ వచ్చాక అతని హోదా పెరిగినా.. ప్రజల కోసం.. నాయకుల కారణంగా నష్టపోయే బాధితుల కోసం పోరాడే అవకాశం లేకపోవటంతో ఈనాడులో పెద్ద ఉద్యోగాన్ని (జర్నలిస్టుగా) సింఫుల్ గా రిజైన్ చేసేసి.. తన దారిన తాను వెళ్లిపోయాడు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి.. చుట్టూ ఉన్న తన వారికి సాయం చేయటం కోసం ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయటంతోపాటు.. విశ్వ మానవ వేదిక పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. బడుగు జీవులు.. బాధితుల తరఫున వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి కమిట్ మెంట్.. అతని పోరాట పటిమ పవన్ ను కదిలించటమే కాదు.. మీడియా ముందుకు వచ్చి గొంతు విప్పేలా చేశాయని చెబుతున్నారు. సినిమాల్లో చూపించే క్యారెక్టర్ మన మధ్యనే ఉండటం.. జనం కోసం తపించటమే తప్పించి.. తన గురించి ఆలోచించక.. పెద్ద హోదాను వదులుకున్న వైఖరి పవన్ లాంటి వ్యక్తిని ప్రభావితం చేసి ఉండాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/