Begin typing your search above and press return to search.

పాపం కాంగ్రెస్.. ఒక్కొక్కరుగా షాకిస్తున్న నేతలు

By:  Tupaki Desk   |   12 May 2019 5:34 PM GMT
పాపం కాంగ్రెస్.. ఒక్కొక్కరుగా షాకిస్తున్న నేతలు
X
ఆంధ్రప్రదేశ్‌ లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో ఏపీలో సున్నా చుట్టిన ఆ పార్టీ.. తెలంగాణలో మాత్రం పర్వాలేదనిపించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని కొంత బలపడింది. కానీ, గత డిసెంబర్‌ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసింది. ముఖ్యంగా టీఆర్ ఎస్ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - కీలక నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి - టీఆర్ ఎస్‌ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ నిర్ణయం తీసేసుకున్నారు. ఇక, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రమే ఆ పార్టీలో కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే దెబ్బ మీద దెబ్బలు తగలడంతో కోలుకోలేకుండా ఉన్న కాంగ్రెస్‌ కు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు మరో తలనొప్పిగా మారాయి. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలనైనా గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. అందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అంతగా మెజారిటీ లేదు. అధికార టీఆర్‌ ఎస్‌ కు మూడింట రెండింతలకుపైగా సభ్యులున్నారు. దీంతో టీఆర్‌ ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకగానే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఆలస్యం అవుతోందని సమాచారం.

ముఖ్యంగా గత ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసి గెలిచి - టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేసిన కొండా మురళీ - ఈ సారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణాలు మాత్రం తెలియడం లేదు. దీంతో అక్కడి నుంచి మరో అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఇక రంగారెడ్డి అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న మల్‌ రెడ్డి రంగారెడ్డి కూడా ఆ పార్టీకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు చెప్పేశారని సమాచారం. ఇక నల్గొండ నుంచి కోమటిరెడ్డి లక్ష్మీ - ఉత్తమ్ పద్మావతి - పటేల్ రమేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీఆర్ ఎస్ అధినేత మాత్రం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.