Begin typing your search above and press return to search.

నయింతో ఆ ఎమ్మెల్యే వెనకేసింది 300కోట్లట

By:  Tupaki Desk   |   4 Sep 2016 3:37 PM GMT
నయింతో ఆ ఎమ్మెల్యే వెనకేసింది 300కోట్లట
X
మరో సంచలనం ఆరోపణ తెర మీదకు వచ్చింది. గ్యాంగ్ స్టర్ నయిం ఆరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వేళ.. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మల్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణ అధికార పక్ష నేతల్ని ఉలిక్కిపడేలా చేయటంతో పాటు.. రాజకీయ వర్గాలు సైతం ఆసక్తి ప్రదర్శించేలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. గులాబీ కారులోకి షిఫ్ట్ అయిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు విధేయుడిగా పేరున్న మల్ రెడ్డి రంగారెడ్డి.. 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. కొద్ది కాలంగా రాజకీయ వేదికల మీద కనిపించని మల్ రెడ్డి.. నయిం ఉదంతంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేందుకు రావటం గమనార్హం. నయిం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి మంచిరెడ్డి వందలాది కోట్ల రూపాయిలు వెనకేసుకున్నట్లుగా ఆరోపించారు. పేదల భూములు లాక్కున్న మంచిరెడ్డి వాటిని రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున సంపాదించారన్నారు. ‘నయిం ప్రధాన అనుచరుడు శ్రీహరిని మంచిరెడ్డి మీద సీబీఐ విచారణ జరిపిస్తే.. అతడి అక్రమాలు బయటకు వస్తాయన్నారు. నయిం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించారు. ‘‘అదిభట్ల భూవివాదంలో మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇబ్రహీం పట్నం.. ఆదిభట్లలోని పేదల భూమి లాక్కున్నాడు. మంచిరెడ్డి మీద సీబీఐ దర్యాప్తు చేయించాలి. తన అక్రమాలు బయటపడతాయనే టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి మారాడు’’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంచిరెడ్డి అవినీతి మీద ఇబ్రహీం పట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే చేసిన ఈ ఆరోపణ ఆ పార్టీ నేతల్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. మరోవైపు మల్ రెడ్డి వ్యాఖ్యలపై మంచిరెడ్డి రియాక్ట్ అయ్యారు. తనకు నయింతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయ లబ్థి కోసమే మల్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.