Begin typing your search above and press return to search.

కేసులు పెడతానని ఒకరు..జైలు తప్పదని మరొకరు

By:  Tupaki Desk   |   6 Sep 2016 5:19 AM GMT
కేసులు పెడతానని ఒకరు..జైలు తప్పదని మరొకరు
X
తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి.. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో సాగుతోంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్న వైనం ఇప్పుడు కొత్త ఉద్రిక్తతలకు కారణంగా మారింది. గ్యాంగ్ స్టర్ నయింతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని.. అందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపిస్తున్నారు. నయింతో కలిసి మంచిరెడ్డి రూ.300 కోట్లు వెనకేసుకున్నట్లగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే.. మల్ రెడ్డి ఆరోపణలపై మంచిరెడ్డి స్పందించారు. తనతో బహిరంగ చర్చకు రావాలంటూ చేసిన సవాల్ కు స్పందించిన ఆయన.. ఏకంగా ఇబ్రహీం పట్నం చౌరస్తాలో వచ్చి కూర్చోటం.. దమ్ముంటే మల్ రెడ్డి రావాలని ఛాలెంజ్ విసరటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించని పక్షంలో మల్ రెడ్డి మీద చట్టప్రకారం చర్యలు తప్పవని మంచిరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి స్పందిస్తున్న మల్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. ఒకవేళ తాను చేసిన ఆరోపణల్ని నిరూపించని పక్షంలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెబుతున్నారు.

చట్టప్రకారం చర్యలు తీసుకుంటానన్న మంచిరెడ్డి వ్యాఖ్యల మీద మల్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘ఆయన సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఓ గ్యాంగ్ స్టర్ లా మాట్లాడుతున్నారు. నియింతో ఆయనకు ఏడెనిమిదేళ్లుగా సంబంధాలు ఉన్నాయి. దమ్ముంటే నయింతో కలిసి చేసిన దందాల గురించి మాట్లాడాలి. మంచిరెడ్డి పేదల నుంచి భూములు లాక్కున్నారు. ఏడేళ్ల నుంచి ఆయన ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో నా దగ్గర ఆధారాలున్నాయి. తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవటానికే టీఆర్ ఎస్ లోకి వెళ్లారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు.

తనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించిన మంచిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన మల్ రెడ్డి.. ‘‘మంచిరెడ్డి దొరికిన దొంగ. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. జైలు కూడా తినక తప్పదు’’ అంటూ మండిపడ్డారు. మల్ రెడ్డి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయటంపై మంచిరెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని మాటలు చెబుతున్న మల్ రెడ్డి.. తాను ఇబ్రహీం పట్నం చౌరస్తాలో వచ్చి ఉంటే చర్చకు ఎందుకు రాలేదన్న సూటి ప్రశ్నను సంధిస్తున్నారు. నయింతో సంబంధాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెబుతున్న మల్ రెడ్డి .. వాటికి సంబంధించి కొన్నింటిని శాంపిల్ గా మీడియాకు విడుదల చేయొచ్చుగా..?