Begin typing your search above and press return to search.

కేసీఆర్ లా ట్రై చేసిన దీదీ.. వ‌ర్క్ వుట్ కాలేదు!

By:  Tupaki Desk   |   12 Jun 2019 12:01 PM GMT
కేసీఆర్ లా ట్రై చేసిన దీదీ.. వ‌ర్క్ వుట్ కాలేదు!
X
ఉద్య‌మ నేత‌ల చేతికి అధికారం వ‌స్తే.. నిర‌స‌న‌ల‌కు అవ‌కాశం ఉండ‌దు. ఈ మాట త‌ప్పుగా ప‌లువురు చెబుతారు కానీ.. తెలంగాణ‌లో కావొచ్చు.. ప‌శ్చిమ‌ బెంగాల్ లో కావొచ్చు.. ఇప్పుడున్న ప‌రిస్థితి చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. క‌మ్యునిస్టుల‌పై క‌త్తి క‌ట్టి.. వారిపై పోరాడి అధికారాన్ని సొంతం చేసుకున్న దీదీ.. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌ల విష‌యంలో ఎలాంటి రియాక్ట్ అవ‌తారో తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పోరాడి సాధించిన కేసీఆర్‌.. అందుకోసం ఎన్ని ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు.. బంద్ లు నిర్వ‌హించారో తెలియంది కాదు. మ‌రింతలా పోరాడిన సాధించుకున్న తెలంగాణ‌లో ఈ రోజున నిర‌స‌న‌లు.. ధ‌ర్నాలు..రాస్తారోకోలు అన్నంత‌నే పోలీసులు ఎంత‌లా రియాక్ట్ అవుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పాలి.

తాను విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అదే ప‌నిగా నిర‌స‌న‌ల‌తో ఎదిగిన దీదీ.. తన చేతికి ప‌వ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత ఎంత‌లా మారిపోయారో.. ప్ర‌జాస్వామ్య‌యుతంగా చేసే నిర‌స‌న‌ల్ని ఎంత‌లా తొక్కేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఈ విష‌యంలో ఇప్ప‌టికే తెలంగాణ‌వాదుల‌కు.. బెంగాలీల‌కు బాగానే అర్థ‌మైన ప‌రిస్థితి. అన్ని రోజులు ఒకేలా ఉండ‌వ‌న్న చందంగా.. తాజాగా బెంగాల్ లోనూ అలాంటి ప‌రిస్థితే. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దీదీ కోట‌లో పాగా వేయాల‌ని త‌పిస్తున్న మోడీషాలు. . ఈ మ‌ధ్య‌నే ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పెరిగిన త‌మ బ‌లాన్ని ఫ‌లితాల రూపంలో చూపించ‌టం తెలిసిందే.

ఎన్నిక‌ల ఫలితాల‌తో బెంగాల్ బీజేపీకి మ‌రింత ఆత్మ‌విశ్వాసం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో.. తాజాగా ఒక భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించారు. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు లాంటివి దీదీకి ఎంత చిరాకో తెలిసిందే క‌దా? అందుకే ఆమె నిర‌స‌న‌ను తొక్కేసే దారిని ఎంచుకున్నారు. అచ్చం కేసీఆర్ మాదిరే పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌తో పాటు.. బ్యారికేడ్ల‌తో కోల్ క‌తా న‌గ‌రాన్ని క‌మ్మేశారు.

అయితే.. బెంగాల్ లో ఉన్న బీజేపీ నేత‌లు.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు లాంటివాళ్లు కాదు క‌దా? అవ‌స‌ర‌మైతే ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌ట‌మే కాదు.. దీదీకి చుక్క‌లు చూపించేందుకు బీజేపీ నేత‌లు ప్ర‌త్యేకంగా రెఢీ అయ్యారు. బెంగాల్ రాజ‌ధాని న‌గ‌రం కోల్ క‌తాలో వారు పెద్ద ఎత్తున నిర‌న‌న నిర్వ‌హించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల హింస‌లో దాదాపు 13మంది మ‌ర‌ణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు కాగా.. ఐదుగురు తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా బెంగాల్ లో ఈ హింస‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న నిర్వ‌హించ‌టంతో కోల్ క‌తా మ‌హాన‌గ‌రం ఉద్రిక్త‌త‌ల‌కు గురైంది. బీజేపీ నిర‌స‌న‌కారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. ముందుకు క‌ద‌ల‌కుండా నిలువ‌రించారు. కాకుంటే.. తెలంగాణ‌లో మాదిరి బెంగాల్ పోలీసుల‌కు ప‌ని ఈజీ కాలేదు. చాలా క‌ష్టంతో బీజేపీ నేత‌ల్ని కంట్రోల్ చేసే ప్ర‌యత్నించారు. అయిన‌ప్ప‌టికీ సాధ్యం కాక‌పోవ‌టంతో లాఠీ ఛార్జ్.. భాష్ప‌వాయువు గోళాల్ని ప్ర‌యోగించారు. అప్ప‌టికి ఒక కొలిక్కి వ‌చ్చింది. చూస్తుంటే.. బెంగాల్ లో రాజ‌కీయ ప‌రిణామ‌లు ఊహించ‌ని రీతి వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.