Begin typing your search above and press return to search.

దీదీ స్పీడుకు బ్రేకులేసే వాడు వ‌చ్చేసిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   17 May 2017 10:13 AM GMT
దీదీ స్పీడుకు బ్రేకులేసే వాడు వ‌చ్చేసిన‌ట్లేనా?
X
ప్ర‌ధాని మోడీ తీరు కాస్త భిన్నం. ఆయ‌న ఒక‌సారి ఏదైనా విష‌యం మీద టార్గెట్ చేస్తే.. దాని సంగ‌తి తేలే వ‌ర‌కూ నిద్ర‌పోరు. ఎదురుదెబ్బ‌లు త‌గిలిన‌ప్ప‌టికీ.. తాను అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ అంత‌కంత‌కూ త‌న ప్ర‌య‌త్నాల్ని పెంచుతూ పోతారే త‌ప్పించి.. వెన‌క్కి మాత్రం అస్స‌లు త‌గ్గ‌రు. ఇలాంటి వైఖ‌రితోనే.. గ‌తంలో అర‌కొర‌గా ఉండే కాషాయ జెండాను.. ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో త‌న‌దైన శైలిలో రెప‌రెప‌లాడేలా చేశారు.

ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని ప‌లు రాష్ట్రాల్లోనూ మార్పు తేగ‌లిగిన మోడీకి.. ప‌శ్చిమ బెంగాల్ మాత్రం ఒక ప‌ట్టాన ప‌ట్టు చిక్క‌లేదు. ఆయ‌న ఎంత ప్ర‌య‌త్నించినా.. ఆ రాష్ట్రంలో బీజేపీ జెండా స‌గ‌ర్వంగా ఎగిరే పరిస్థితి అస్స‌లు ఉండ‌ని దుస్థితి. ఇది.. క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌వ‌రాన్ని రేపేది. అయితే.. ఇక‌పై అలాంటి బాధ వారికి లేన‌ట్లే. తాజాగా వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ నేత‌ల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వ‌ట‌మేకాదు.. ప‌శ్చిమ‌బెంగాల్ మీద మ‌రిన్ని క‌ల‌ల్ని క‌నేందుకు అవ‌కాశం ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటి ఫ‌లితాలు ఈ రోజు వెల్ల‌డ‌య్యాయి. ఎప్ప‌టిలానే అధికార టీఎంసీ ఈ స్థానాల్లో దూసుకెళుతుంద‌ని భావించిన వారికి షాకిచ్చేలా ఫ‌లితాలు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ.. ఏ ఎన్నిక‌ల్లో అయినా దూసుకెళ్లే తృణ‌మూల్ కాంగ్రెస్ కు తాజాగా ఎన్నిక‌లు క‌రెంట్ షాక్ కొట్టినంత ప‌ని చేశాయ‌న‌టంలో సందేహం లేదు.

ఎందుకంటే.. మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో నాలుగు మాత్ర‌మే దీదీపార్టీ సొంతం కాగా.. మ‌రో మూడు మున్సిపాలిటీలు బీజేపీ.. గుర్ఖా జ‌న‌ముక్తి మోర్చా సొంతం చేసుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. డార్జిలింగ్ తో పాటు.. కెర్సాంగ్‌.. క‌లింపాంగ్ లో టీఎంసీకి భారీ షాకిస్తూ.. ఘ‌న‌విజ‌యాన్ని బీజేపీ-జీజేఎం కూట‌మి సొంతం చేసుకోవ‌టంతో.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌న్న మోడీ ఆశ‌ల‌కు మొద‌టి అడుగు ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఫ‌లితాలు క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయ‌న‌టంలో సందేహప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని చెప్పాలి.