Begin typing your search above and press return to search.

కేంద్రం దివాళా తీసిందంటూ ఆ సీఎంల ప్రచారం

By:  Tupaki Desk   |   20 Nov 2016 5:10 AM GMT
కేంద్రం దివాళా తీసిందంటూ ఆ సీఎంల ప్రచారం
X
ఇద్దరి మధ్య సవాలచ్చ ఉండొచ్చు. నచ్చకపోతే తిట్టొచ్చు. అరిచి గోల చేయొచ్చు. కానీ.. వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. కానీ.. బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. వారు చేస్తున్న రచ్చ ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉంటూ.. కేంద్రం తాము చెప్పింది వినలేదంటూ రోడ్ల మీదకు వచ్చి చేస్తున్న సరికొత్త యాగీ ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చగా మారింది. మోడీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కొందరు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుంటారు. వీరితో పాటు మరికొందరు ముఖ్యమంత్రులకు మోడీ నిర్ణయం నచ్చకున్నా.. తమ వాదనను వినిపిస్తూ హుందాగా వ్యవహరిస్తున్నారు.

అయితే.. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దును వెనక్కి తీసుకోవాలని.. పాత నోట్ల చెలామణిని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని మోడీకి ఇచ్చిన వారు.. ప్రస్తుతం తామిచ్చిన సమయం తీరిపోవటంతో ప్రత్యక్ష ఆందోళనల్లోకి దిగారు.

తాము ముఖ్యమంత్రులమన్న విషయాన్ని మర్చిపోయి.. వీధుల్లోకి వచ్చి ఏటీఎంల దగ్గరున్న ప్రజల్ని పలుకరిస్తూనే.. కేంద్రం దివాళా తీసిందని.. వెంటనే పాత ఐదు వందలు.. రూ.వెయ్యి నోట్లను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేయటం గమనార్హం. బ్యాంకుల్లో డబ్బులు ఉండి కూడా తీసుకునే అవకాశం కస్టమర్లకు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా షురూ చేసిన తీరులో పశ్చిమ బెంగాల్ అంతటా ర్యాలీలు నిర్వహించేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు మొదలు పెడితే.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఇదే తీరులో వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఢిల్లీలోనే కాకుండా పంజాబ్ లో కూడా ఇదే తీరులో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని భావిస్తున్నారు. కీలక హోదాల్లో ఉన్న వారు తమ బాధ్యతల్ని వదిలిపెట్టి.. ఇలా రోడ్ల మీదకు వచ్చి కేంద్రం దివాళా తీసిందంటూ ప్రచారం చేయటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ రోజు మోడీ నిర్ణయం బాగోలేదని రోడ్ల మీదకు వచ్చిరచ్చ రచ్చ చేస్తున్న ముఖ్యమంత్రులు ఇద్దరు.. తమ రాష్ట్రంలో ప్రజలు అసలేం కష్టాలు పడటం లేదా? సమస్యలకు గురి అవటం లేదా? మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇబ్బందులు అస్సలు ఎదుర్కోవటం లేదా? లాంటి ప్రశ్నలు వేసుకుంటే వారి పాలన ఎంత సుబ్బరంగా ఉందో తెలుస్తుంది. ఎక్కడి వరకో ఎందుకు.. దోమల వ్యాప్తి నివారణలో అడ్డంగా ఫెయిల్ అయి.. ఢిల్లీ రాష్ట్రాన్ని డెంగ్యూ రాష్ట్రంగా మార్చిన కేజ్రీవాల్ ఈ రోజు మోడీ మీద పోరాడే క్రమంలో పాలనను పక్కన పెట్టేసిన వైనాన్ని మర్చిపోకూడదు.

ముఖ్యమంత్రులుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధానం వేరుగా ఉంటుంది. నిజంగానే ప్రధాని తీసుకున్న నిర్ణయం సరిగా లేకున్నా.. అందులో లోపాలు ఉన్న పక్షంలో మోడీతో భేటీ కావటం.. సలహాలు.. సూచనలు ఇవ్వటం లాంటివి చేయాలే తప్పించి.. వీధుల్లోకి వచ్చి ఇలా రచ్చ చేసి.. ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించేలా.. ఆందోళన పెంచేలా నిర్ణయాలు తీసుకోవటం ఏమిటన్నది ప్రశ్న. ముఖ్యమంత్రులుగా తమకున్న స్థాయిని మరిచి చేస్తున్న రచ్చ రానున్నరోజుల్లో మరెన్ని విపరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆందోళనగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/