Begin typing your search above and press return to search.

మమత మోదీకి పోటీయా? రాహుల్ కా ?

By:  Tupaki Desk   |   26 July 2018 7:26 AM GMT
మమత మోదీకి పోటీయా? రాహుల్ కా ?
X
రాహుల్ గాంధీ ఆశపడుతున్న ప్రధాని పీఠానికి మరో పోటీదారు తయారయ్యారు. ఇప్పటికే మాయావతి ఆ కుర్చీపై కన్నేయగా ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆ కుర్చీపై తనకున్న మక్కువను తన పార్టీ నేతలతో చెప్పిస్తున్నారు. అందులో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓ బ్రియాన్ తాజాగా మాట్లాడుతూ.... కాబోయే ప్రధాని మమత కాక ఇంకెవరని అన్నారు. మమతా బెనర్జీ నాయకత్వ పటిమను - 40 ఏళ్ల ఆమె రాజకీయ పోరాటాన్ని ఒక్క పశ్చిమ బెంగాల్‌ ప్రజలే కాదని యావత్‌ దేశం ఆమోదించిందని.. ప్రధాని పదవికి ఆమె పేరు ముందు వరుసలో ఉందని అన్నారు.

ప్రతిపక్షాల నుంచి ఆరెస్సె్‌సయేతర వ్యక్తిని ప్రధానిగా అంగీకరించడానికి కాంగ్రెస్‌ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒబ్రెయిన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘2018-19 ‘థింక్‌ ఫెడరల్‌’ సంవత్సరం. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో మమతా బెనర్జీ చాలా సీనియర్‌ నాయకురాలు’’ అని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. జనవరిలో కోల్‌కతాలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం ఆమె ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల నాయకులను స్వయంగా ఆహ్వానించనున్నారు.

అయితే... మమత ఓవైపు ప్రధాని పీఠం వైపు చూస్తుంటే బెంగాల్ వామపక్ష నేతలు మాత్రం ఆమెది బీజేపీ ఎజెండా అంటూ ఆరోపిస్తున్నారు. కాషాయ పార్టీతో చేతులు కలిపారని విమర్శిస్తున్నారు. తాజాగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఆరెస్సెస్‌ - బీజేపీల మతపరమైన ఎజెండాను మమత ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని మమత.. అన్నా అని సంబోధిస్తారని, ఆమెను మోదీ.. సోదరి అంటారని, ఇద్దరూ కలిసి అన్నా-చెల్లెళ్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.