Begin typing your search above and press return to search.

మమ‌త ప్ర‌చారం మొద‌లు.. మెజారిటీపైనే చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   9 Sep 2021 2:50 AM GMT
మమ‌త ప్ర‌చారం మొద‌లు.. మెజారిటీపైనే చ‌ర్చ‌!
X
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ రాష్ట్ర‌మంత‌టా విజ‌య‌ఢంకా మోగించినా, అనూహ్య రీతిలో త‌ను ఎమ్మెల్యేగా ఓడిపోయిన టీఎంసీ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. మమ‌త‌కోసం ఆమె పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అది కూడా గ‌తంలో మ‌మ‌త వ‌ర‌స‌గా రెండు సార్లు నెగ్గిన భ‌వానీపూర్ సీట్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో నెగ్గిన ఎమ్మెల్యే ఆయ‌న‌. ఇలా మ‌మ‌త‌కు అచ్చి వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆమె ఎంత మెజారిటీని సాధిస్తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది.

బెంగాలీలు భ‌బానీ పూర్ గా వ్య‌వ‌హ‌రించే ఈ నియోజ‌క‌వ‌ర్గం కోల్ క‌తా మ‌హాన‌గ‌రంలో భాగ‌మే. కోల్ క‌తా జిల్లానే. ఎంపీ సీటు విష‌యంలో కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం కోల్ క‌తా ప‌రిధిలోనే వ‌స్తుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2011లో మ‌మ‌త బంప‌ర్ మెజారిటీతో నెగ్గారు. అప్ప‌ట్లో ఆమె మెజారిటీ 50 వేల స్థాయిలో వ‌చ్చింది.

క‌మ్యూనిస్టు పార్టీ అభ్య‌ర్థిని చిత్తుగా ఓడించి ఆమె ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో కూడా ఆమె ఎమ్మెల్యేగా అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే రెండోసారి ఆమెకు దాదాపు 30 వేల స్థాయిలో మాత్ర‌మే మెజారిటీ వ‌చ్చింది. రెండోసారి కాంగ్రెస్ అభ్య‌ర్థి ఈమెకు గ‌ట్టి పోటీ ఇచ్చారు. బీజేపీ కూడా ఓట్ల‌ను చీల్చింది.

ఇక ఇటీవ‌లి బెంగాల్ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీఎంసీ అభ్య‌ర్థి మంచి మెజారిటీతోనే గెలిచాడు. ఇలా ఇది టీఎంసీ కంచుకోట‌గా నిలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌మ‌త పోటీ చేస్తున్నారిప్పుడు. ఈ నెల 10వ తేదీన ఈమె నామినేష‌న్ దాఖ‌లు చేస్తున్నారు.

అంత‌క‌న్నా మునుపే.. ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. ఈ నెల 30వ తేదీన ఈ ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ మూడున ఫ‌లితాల వెల్ల‌డి జ‌ర‌గ‌బోతోంది. మ‌రి సీఎం హోదాలో మ‌మ‌త ఏ రేంజ్ మెజారిటీని సంపాదించుకుని , త‌న రాజ‌కీయ స‌త్తా చూపిస్తుందో!