Begin typing your search above and press return to search.

‘క్యూ’లో నిలుచుంటే బిచ్చగాళ్లేనా దీదీ?

By:  Tupaki Desk   |   16 Nov 2016 4:31 AM GMT
‘క్యూ’లో నిలుచుంటే బిచ్చగాళ్లేనా దీదీ?
X
అదేం సిత్రమో కానీ కొందరికి జల్దీగా కోపం వచ్చేస్తుంటుంది. సిరాకు పడిపోతుంటారు. తాము కోరుకున్నట్లుగానే దేశం ఉండాలని ఫీలైపోతారు. రబ్బరు చెప్పులు వేసుకొని సింఫుల్ గా ఉంటానని చెప్పేరాజకీయ నేత.. ఆ ఆదర్శాన్ని తన పాలనలో మాత్రం చూపించరు. అదేమని ఎవరు అడిగినా వాళ్లకు తనదైన బడితెపూజ చేసేస్తారు. డ్రాయింగ్ రూంలలో కూర్చొని దేశంఅసలు ఎలా ఉండాలో తెలుసా? అంటూ లెక్చర్లు ఇచ్చేవాళ్లు చాలామందే.

సరే.. ఇన్ని మాటలు చెప్పారు కదా? మీరేం చేయబోతున్నారు? అని అడిగితే నేను చేస్తేనే దేశం బాగుపడిపోతుందా? అని రివర్స్ గేరులో మాట్లాడే వారు కోకొల్లులుగా కనిపిస్తారు. గడిచిన మూడు..నాలుగు రోజులుగా ఇలాంటి బాపతు జనాల నోటి హడావుడి మరింత పెరిగిపోయింది. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉన్నంతలో అక్రమార్కులకు.. బ్లాక్ మనీ గాళ్లకు ఇదో చెప్పుదెబ్బ. అదే సమయంలో జనాలకు కూడా ఎంతోకొంత ఇబ్బందే. అయితే.. ఇబ్బందిని ఎవరికి వారుఊహించుకునే స్థాయిని బట్టి దీని తీవ్రత మారిపోతూ ఉంటుంది.

మొదట్లో పెద్దనోట్ల రద్దుపై ఎవరూ ఏమీ మాట్లాడకున్నా.. గడిచిన మూడు రోజులుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు ఎక్కువయ్యారు. అదేమంటే.. జనాలు అలా గంటల తరబడి క్యూలలో నిలుచోబెట్టటం ఏమిటంటూ ఫైర్ అవుతున్నారు. నిజానికి క్యూలో నిలుచోవటం అన్నది తెలీదన్నట్లు.. అసలు అలాంటి కష్టం ఒకటి ఉండన్నట్లుగా జనాలు చెప్పే మాటలు చూస్తే బాపురే అనుకోవాల్సిందే. తిరుమల కొండ మీద క్షణం పాటు కనిపించే స్వామి దర్శనం కోసం ఎన్నేసి గంటలు ఖర్చు చేస్తామో మర్చిపోయారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలుచోవటం కోసమే అన్నట్లుగా తిరుమలకు ప్లాన్ చేసుకొని వెళ్లే జనాల మాటేమిటి?

ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అసౌకర్యాలు మామూలే. వాటిని పెద్ద మనసుతో స్వాగతించాలి. ప్రధాని చెప్పినట్లుగా 50 రోజుల తర్వాత పరిస్థితిలో మార్పు రాకపోతే.. అప్పుడు నిందించినా ఫలితం ఉంటుంది. విత్తనం నాటిన రోజులోనే పండ్లు చేతికి రావాలని అనుకోవటం భావ్యం కాదేమో. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటలు వింటే ఇదే తరహాలో అనిపిస్తాయి. బ్యాంకుల ముందు.. ఏటీఎంల ముందు క్యూలో నిలుచున్న జనాల్ని చూస్తే తీవ్ర వేదన వ్యక్తం చేసిన ఆమె.. మోడీపై అగ్గి ఫైర్ అయ్యారు. జనాల్ని బిచ్చగాళ్లను చేశారంటూ మండిపడ్డారు.

నిజానికి మమతా లాంటి నేతలు అనుకోవాలే కానీ.. ప్రజలు పాట్లు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమదైన శైలిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదా? కానీ.. కేంద్రంతీసుకున్న నిర్ణయాన్ని వీలైనంతగా తప్పు పట్టి.. దాని ద్వారా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసి.. మోడీ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారే కానీ.. నల్లధనాన్ని చెక్ చెప్పటానికి ఒకరు మొదలు పెట్టిన ప్రయత్నాన్ని అందరూ నిండుమనసుతో స్వాగతించి.. మార్పు తీసుకొద్దామన్న భావన మచ్చుకు కూడా మమత లాంటి వాళ్లలో కనిపించదు. అందుకే.. క్యూలో నిలుచున్న ప్రజలకు మోడీ అంటే మరింత మండిపోయేలా మాట్లాడుతున్నారే కానీ.. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా వారికి ఆ ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తామేం చేయగలమన్న విషయాన్ని మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/