Begin typing your search above and press return to search.

మమతాబెనర్జీ అలర్టయిపోయింది..

By:  Tupaki Desk   |   18 Sep 2015 10:55 AM GMT
మమతాబెనర్జీ అలర్టయిపోయింది..
X
బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎత్తుగడలు, మోడీ మాయాజాలాన్ని చూస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ ఎత్తుగడలను అడ్డుకోవడానికి... ప్రజల్లో సెంటిమెంట్ లు పట్టి ఉంచడానికి వీలుగా అస్త్రాలను ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నారామె. అందులో భాగంగానే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కి సంబంధించిన 12,744 పేజీలతో కూడిన 64 దస్త్రాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం బహిర్గతం చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నేతాజీకి సంబంధించి ఉన్న ఎన్నో సందేహాలకు ఈ డాక్యుమెంట్ లలో సమాధానాలు దొరక్కపోయినా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పరంగా నేతాజీకి సంబంధించి ఎలాంటి రహస్యమూ దాచలేదన్న భావనను మమత ప్రజల్లో కల్పించగలిగారు. అదేసమయంలో నేతాజీకి సంబంధించిన రహస్యాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయంటూ బంతిని కేంద్రం కోర్టులో వేశారామె. శుక్రవారం విడుదల చేసి 64 డాక్యుమెంట్లు ప్రజల సందర్శనార్థం సోమవారం నుంచి కోలకతాలోని పోలీసు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. 12,744 పేజీలతో కూడిన 64దస్త్రాలను నేతాజీ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, అవి మొత్తం డిజిటైజ్‌ చేసి ఉన్నాయని కోల్‌కతా పోలీసు కమిషనర్‌ సురజిత్‌ తెలిపారు. కీలక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు నేతాజీ కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్‌ కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనల్లుడు కృష్ణబోస్ భార్య కూడా ఉన్నారు. 1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ ఫైళ్లలో ఉన్నప్పటికీ వీటిలో కీలకమైన సమాచారమేమీ లేదు. కీలకమైన దస్త్రాలన్ని కేంద్రం ఆదీనంలోనే ఉన్నాయని చెబుతున్నారు.

విదేశాలతో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను విడుదల చేయలేమని గత ఆగస్టులో పిఎంవో కేంద్ర సమాచార కమిషన్‌ కు చెప్పింది. దీంతో, అసలైన ఫైల్స్ కేంద్రం వద్దే ఉన్నాయని అర్థమవుతోంది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలనే, ప్రధాని మోడీని కౌంటర్ చేయాలనే ఉద్దేశంతోనే మమతా బెనర్జీ ఇప్పుడు ఆ ఫైల్స్‌ తో హడావుడికి తెరతీశారని భావిస్తున్నారు.

మరోవైపు కేంద్రం వద్ద ఉన్న అతి కీలకమైన డాక్యుమెంట్ లను ప్రధాని మోడీ బెంగాల్ ఎన్నికల సమయంలో కొంతమేర వెల్లడించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మమతాబెనర్జీ ముందే ఆ పనిచేసినట్లూ చెబుతున్నారు. మోడీ కంటే ముందే నేతాజీ సెంటిమెంటును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇప్పుడు వీటిని వెల్లడించారని చెబుతున్నారు. మమత ఆలోచనలు, ఎత్తుగడలు చూస్తుంటే వచ్చే ఎన్నికల కోసం ఆమె ఇప్పటికే అలర్టయిపోయారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మోడీ ఉత్తరాదిలో జోరు చూపిస్తున్నట్లు తూర్పు భారతంలో ఎంతవరకు ప్రభావితం చేయగలరో చూడాలి.