Begin typing your search above and press return to search.

దీదీకున్న భయం బాబుకు లేదా?

By:  Tupaki Desk   |   2 Feb 2017 4:27 PM IST
దీదీకున్న భయం బాబుకు లేదా?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో తెలిసిందే. అమెరికా లాంటి ఫ్రీ కంట్రీలో కొత్తకొత్త పరిమితులు పెడుతూ.. చుక్కలు చూపిస్తున్న కొత్త అధ్యక్షుడి కారణంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. హెచ్ 1 బి వీసాలపై నియంత్రణ.. ఏడు ముస్లిం దేశాల మీద విధించిన పరిమితులు.. మిగిలిన దేశాల మీద కూడా పడటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

దీనికి తోడు.. అమెరికాలో జాత్యాంహకార ఘటనలు చోటు చేసుకుంటున్నట్లుగా.. పలువురు బెదిరింపులకు గురి అవుతున్నట్లుగా అనధికారవర్గాల నుంచి వినిపిస్తున్న మాటలుగా చెప్పాలి. ఇలాంటి వార్తల్ని ప్రముఖ మీడియా సంస్థలేవీ కన్ఫర్మ్ చేయటం లేదు. ఇదిలా ఉంటే.. వీసాల నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు వ్యవమరిస్తున్న వైఖరిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విదేశాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలు.. ఐటీ ఉద్యోగుల ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పెరగటానికి తానే కారణమని.. ఈ రోజు అమెరికాలో తెలుగువారు అంతగా ఉన్నారంటే అంతా తన పుణ్యమేనని తరచూ జబ్బలు చరుచుకునే చంద్రబాబు..ట్రంప్ విషయంలోఎలాంటి భయాందోళనలు పడటం లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

భారత ఐటీ పరిశ్రమ వృద్ధికి తాను కూడా కారణమని నిత్యం చెప్పుకునే చంద్రబాబుకు.. అమెరికాలో ఐటీ జీవుల ప్రయోజనాలు కాపాడాలన్న అంశంపై ఎందుకు రియాక్ట్ కావటం లేదన్నది ప్రశ్నగా మారుతోంది. హెచ్ 1 బి వీసాల మీద వస్తున్న సమాచారం చాలా ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో.. అమెరికాలో ఉన్న మనవారికి మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించాలని చెబుతున్న దీదీ ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. పశ్చి బెంగాల్ ముఖ్యమంత్రికే ఇంత భయాందోళనలు ఉన్నప్పుడు.. ఐటీ పరిశ్రమను ఎంతో ఎత్తుకు చేర్చిన బాబుకు మరెంత ఆందోళన ఉండాలి? మరి.. ఆయనీ విషయంపై ఎందుకు మాట్లాడనట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/