Begin typing your search above and press return to search.

మోడీపై బెంగాల్ ఆడ'పులి'కి కోపమొచ్చింది..

By:  Tupaki Desk   |   22 Nov 2016 7:48 AM GMT
మోడీపై బెంగాల్ ఆడపులికి కోపమొచ్చింది..
X
నోట్ల రద్దు వ్యవహారంతో ముప్పతిప్పలు పడుతున్న మోడీ ప్రభుత్వంపై కొత్త నోట్లు కూడా సరికొత్త విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా రూ.2 వేల నోటు నాణ్యత - ఆకర్షణీయతపై ఇప్పటికే విమర్శలు రాగా తాజాగా మరో వివాదం మొదలైంది. నోటుపై ముద్రించిన చిత్రాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొత్తగా తెచ్చిన 2000 నోటుపై జాతీయ జంతువు టైగర్‌ బొమ్మ లేకపోవడంపై ఆమె దుమ్మెత్తిపోస్తున్నారు. మోడీ సర్కార్ కుట్ర పూరితంగానే బెంగాల్ టైగర్‌ బొమ్మను ముద్రించలేదని మమతా ఆరోపించారు. నోట్ల ముద్రణలోనే మోడీ ఉద్దేశాలు బయటపడిపోయాయన్నారు.

2 వేల నోటుపై ఏనుగు - నెమలి - కమలం బొమ్మలున్నాయి. నెమలి జాతీయ పక్షి కాగా - కమలం జాతీయ పుష్పం... ఆ లెక్క ప్రకారం జాతీయ జంతువు అయిన బెంగాల్‌ టైగర్ బొమ్మ దానిపై ఉండాలి. అంతేకాదు... ఆర్బీఐ ముద్రించే అన్ని నోట్లపై ఆ బొమ్మ ఉంటుంది. కొత్త రూ.2000 నోటుపై మాత్రం ఏనుగు - నెమలి - కమలం బొమ్మలున్నాయి. కానీ 2 వేల నోటుపై జాతీయ జంతువు పులికి బదులు జాతీయ సంపద అయిన ఏనుగు చిత్రం ఉంది. దీంతో మమత మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ''ఏనుగు మన జాతీయ సంపద - కమలం జాతీయ పుష్పం - నెమలి జాతీయ పక్షి కాబట్టి వాటికి చోటుకల్పించడం సబబే కానీ జాతీయ జంతువు పులి బొమ్మను ఎందుకు తొలగించినట్లు? ఈ ప్రశ్నకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే" అని మమత బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఏనుగు రాజ్యాంగానికి చిహ్నం కాబట్టి ముద్రించారనుకున్నా పులికి చోటు కల్పించకపోవడం మాత్రం జాతీయవాది పార్టీ అయిన బీజేపీ చేసిన పొరపాటే అనిపిస్తోంది. ఇది పొరపాటు కాదని... పులిని తొలగించి బెంగాల్ ఆడపులి మమతను రెచ్చగొట్టడమే మోడీ ఉద్దేశమని అంటున్నవారూ ఉన్నారు. అయితే నోటుపై ఆర్‌ బీఐ లోగో మధ్యలో మాత్రం పులి బొమ్మ ఉంది. కేంద్రం మమత విమర్శలపై ఇంకా స్పందించకున్నా ఇదే బొమ్మను చూపించి సమర్ధించుకునే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/