Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌లు దీదీ ద‌గ్గ‌ర ఉడ‌క‌లేదంటారా?

By:  Tupaki Desk   |   3 Jan 2019 5:51 AM GMT
కేసీఆర్ మాట‌లు దీదీ ద‌గ్గ‌ర ఉడ‌క‌లేదంటారా?
X
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసే హ‌డావుడి గురించి తెలిసిందే. దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క‌మైన మార్పు కోసం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కాన్సెప్ట్ ను తెర మీద‌కు తెచ్చినట్లు చెప్పే ఆయ‌న‌.. చాలానే చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఫ్లైట్లు వేసుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య‌నేత‌ల్ని క‌లిసిన కేసీఆర్‌ కు గ‌ట్టి షాక్ త‌గిలే ప‌రిణామం ఒకటి చోటు చేసుకుంది.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జ‌త క‌ట్టేందుకు ఈ మ‌ధ్య‌నే ఒడిశా.. ప‌శ్చిమ‌ బెంగాల్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో భేటీ అయిన కేసీఆర్‌.. మ‌రింత‌మందిని కూడ‌గ‌ట్ట‌నున్న‌ట్లు చెప్ప‌టం తెలిసిందే. త‌మ ఫెడ‌ర‌ల్ ప్రంట్ లో తాను క‌లిసిన వారు ఉంటార‌న్న సంకేతాల్ని కేసీఆర్ ఇస్తున్న వేళ‌..ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

త‌మ పార్టీ అధినేత.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తావ‌ని నిర్మాణం కోసం ప‌ని చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది మామూలు వ్య‌క్తి కాదు. దీదీకి మేన‌ల్లుడు.. పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే తృణ‌మూల్ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ వీడియో రూపంలో ఈ మెసేజ్ విడుద‌ల చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ ప‌డే అధినేత‌గా దీదీ అవ‌త‌రించిన‌ట్లుగా చెప్పాలి. దీదీ.. న‌వీన్ ప‌ట్నాయ‌క్.. అఖిలేశ్ లాంటి నేత‌లతో క‌లిసి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా దీదీ ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీలో ఉన్నార‌ని చెప్ప‌టం దేనికి సంకేతం అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.

దీదీ పార్టీ ప్ర‌క‌ట‌న చూస్తే..కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ప్రంట్ కు మ‌మ‌తా పెద్ద ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌న్న మాట అర్థం కాక మాన‌దు. అంద‌రిని క‌లుపుకు వెళ్లే ప్ర‌య‌త్నంలో కేసీఆర్ ఆదిలో ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా వారికి సంబంధం లేని వేదిక‌ను ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ ప్ర‌య‌త్నాల‌కు తాజాగా దీదీ పార్టీ ప్ర‌క‌ట‌న గండికొట్టిన‌ట్లే.

ప్ర‌ధాని ప‌ద‌వికి మ‌మ‌త ఆస‌క్తి ఉంటే.. ఆ నిర్ణ‌యాన్ని ఫెడ‌రల్ ఫ్రంట్ కు అన్నీ తానైన కేసీఆర్ నోటి నుంచి రాలేదంటే.. వారి మ‌ధ్య జ‌రిగిన భేటీ నెగిటివ్ రిజ‌ల్ట్ ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా ప‌రిణామం చూస్తే.. దీదీకి ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టాల‌న్న ఆస‌క్తి ఉంద‌న్న విష‌యాన్ని తృణ‌మూల్ ఓపెన్ కావ‌ట‌మే కాదు.. అందుకు త‌గ్గ‌ట్లుగా మ‌ద్ద‌తు ఇచ్చే కూట‌మిలో తాము చేర‌తామ‌న్న సందేశాన్ని మ‌మ‌త మేన‌ల్లుడి వీడియో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.