Begin typing your search above and press return to search.

ర‌చ్చ గెలిచేందుకు.. ఇంటిని సిద్ధం చేసుకుంటున్న దీదీ

By:  Tupaki Desk   |   13 Feb 2022 10:30 AM GMT
ర‌చ్చ గెలిచేందుకు.. ఇంటిని సిద్ధం చేసుకుంటున్న దీదీ
X
దేశ రాజ‌కీయాల్లో ప్ర‌ధాని మోడీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వేగంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బెంగాల్‌ను దాటి పార్టీని విస్త‌రించేందుకు ఆరాట‌ప‌డుతున్నారు. అందుకు అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను ఆమె ఉప‌యోగించుకుంటున్నారు. గోవాలో అధికార బీజేపీని ఢీ కొడుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అంతా బాగానే ఉంది. కానీ జాతీయ రాజ‌కీయాల్లో నెట్టుకురావాలంటే రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేయాలి. అందుకే ముందు పార్టీపై దృష్టి పెట్టాలి. ముందుగా పార్టీలో ఉన్న విభేదాల‌ను ప‌రిష్క‌రించాలి. ఇప్పుడు దానిపైనే మ‌మ‌త ఫోక‌స్ చేశార‌ని తెలిసింది.

ఆ నేపథ్యంలోనే తృణ‌మూల్ కాంగ్రెస్ జాతీయ ఆఫీస్ బేర‌ర్ల క‌మిటీని దీదీ ర‌ద్దు చేశారు. పార్టీలోని విభేదాలను ప‌రిష్క‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా 20 మంది స‌భ్యుల‌తో కొత్త‌గా కార్య‌నిర్వాహ‌క క‌మిటీని ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు ర‌ద్దైన క‌మిటీలో మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు, పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి అభిషేక్ బెన‌ర్జీ కూడా ఉండ‌డం విశేషం. పార్టీపై త‌న‌కున్న క‌మాండ్‌కు అద్దం ప‌ట్టేలా సీనియ‌ర్ నేత‌ల‌తో ఆమె కార్య‌నిర్వాహ‌క క‌మిటీని నింపేశారు. పార్టీలోని సీనియ‌ర్ల‌కు, జూనియ‌ర్ల‌కు మ‌ధ్య విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ ఆమె పెద్ద నేత‌ల వైపే మొగ్గుచూపార‌ని తెలిసింది.

టీఎంసీలోని సీనియ‌ర్లు పార్టీ, ప్ర‌భుత్వంలో ఒక‌టి కంటే ఎక్కువ ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్నార‌ని అభిషేన్ బెన‌ర్జీ మ‌ద్ద‌తున్న కొత్త త‌రం నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. గ‌తేడాది శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఘ‌న విజ‌యం అనంత‌రం అభిషేక్‌కు పార్టీలో ప్రాభ‌వం పెరిగింది.

కానీ ఇప్ప‌టికీ నాయ‌కులంద‌రూ మ‌మ‌తా బెన‌ర్జీనే త‌మ సుప్రీం నాయ‌కురాలు అని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలోని విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం మ‌మ‌త దృష్టి పెట్టారు. త్వ‌ర‌లోనే ఆమె కొత్త ఆఫీస్ బేర‌ర్ల క‌మిటీని ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. మొత్తానికి ముందు పార్టీని గాడిలో పెట్టి.. త‌ర్వాత విస్త‌ర‌ణ‌పై ధ్యాస సారించాల‌ని ఆమె చూస్తున్నారు.