Begin typing your search above and press return to search.

మారిన దేశ రాజకీయం.. మమతా ‘జనతా’..

By:  Tupaki Desk   |   1 April 2019 7:53 AM GMT
మారిన దేశ రాజకీయం.. మమతా ‘జనతా’..
X
విశాఖ వేదికగా జాతీయ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ కు మద్దతిచ్చిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబులు మాట మార్చేశారు. రాహుల్ గాంధీ-కాంగ్రెస్ మాటను మాటమాత్రమైనా పలుకలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి నోట ‘జనతా ఫ్రంట్’ మాట వినపడింది. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జనతా ఫ్రంట్ వస్తుందంటూ ఘంటా బజాయించారు.

ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మార్పునకు చిహ్నంగా మారాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన మమతా, చంద్రబాబు , కేజ్రీవాల్ లు విశాఖ వేదికగా కలిసి ప్రసంగించారు. ఇక్కడే జనతా ఫ్రంట్ ప్రస్తావన వచ్చింది. మమతా తొలిసారి పలకగా.. చంద్రబాబు ఇదే మాట అన్నారు. దీంతో కాంగ్రెస్ తగినంత మెజార్టీ రాకపోతే జనతా ఫ్రంట్ దే దేశంలో అధికారమని స్పష్టమైంది.

కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ఇదే.. ప్రాంతీయ పార్టీలు మెజార్టీ సీట్లు సాధిస్తే కేంద్రంలో అధికారం పంచుకొని దేశ రూపురేఖలు మార్చాలన్నది దాని అభిమతం.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కార్యరూపం దాల్చుతుందో లేదో కానీ.. ఇప్పుడు మమతా బెనర్జీ కొత్తగా ‘జనతా ఫ్రంట్’ అనడం మాత్రం కేసీఆర్ కలలకు మార్గం చూపినట్టైంది. బాబు, మమత, కేజ్రీవాల్ ఇప్పటికే ఒక్కటిగా ఉన్నారు. ఒకవేళ జనతా ఫ్రంట్ గనుక సార్వత్రిక ఎన్నికల తర్వాత రూపుదిద్దుకుంటే కాంగ్రెస్, బీజేపీలకు తగినంత మెజార్టీ రాకపోతే.. ఖచ్చితంగా మూడో ఫ్రంట్ కే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లెక్కన కేసీఆర్ కలలు,, మమత ఆశలు నెరవేరే థర్డ్ ఫ్రంట్ కు విశాఖలో బీజం పడినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కు అడుగులు పడ్డట్టే కనిపిస్తోంది.