Begin typing your search above and press return to search.

ట్విస్టులు ఏమీ లేకుండా సిం'ఫుల్' గా గెలిచిన దీదీ

By:  Tupaki Desk   |   3 Oct 2021 4:05 PM GMT
ట్విస్టులు ఏమీ లేకుండా సింఫుల్ గా గెలిచిన దీదీ
X
కొద్ది నెలల క్రితం జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎన్నికల సందర్భంగా దీదీని ఓడించటమే లక్ష్యంగా ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ పడిన తపన పెద్ద చర్చకు తెర తీసింది. తన అస్త్రశస్త్రాల్ని దీదీ మీదకు సంధించిన బీజేపీ.. ఆమె పోటీ చేసిన స్థానంలో ఓడేలా చేయగలిగారు కానీ.. ఆమె పార్టీ ఘన విజయాన్ని సొంతం కాకుండా అడ్డుకోలేకపోయారు. ఆమె పోటీ చేసిన స్థానంలో దీదీ ఓడినప్పటికీ.. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే.. ఆర్నెల్ల లోపు ఉప ఎన్నికల్లో గెలవాల్సిన నేపథ్యంలో ఆమె భవానీ పూర్ బరి నుంచి దిగారు.

దీదీ కోసం భవానీపూర్ లో విజయం సాధించిన శోభన్ దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయటం తెలిసిందే. ఆ త్యాగానికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇక.. పార్టీకి బలమైన భవానీ పూర్ నుంచి జరిగిన ఉప ఎన్నిక ఫలితం తాజాగా వెల్లడైంది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. దీదీ గెలుపు అందరూ ఊహించిందే. ఉప ఎన్నికల్లో ఆమె ఘన విజయాన్ని సాధిస్తుందన్న అంచనాలకు తగ్గట్లే.. ఎలాంటి ట్విస్టులు లేకుండా ఆమె గెలుపొందారు. దీంతో గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓడిన దీదీకి ఊరట లభించినట్లైంది.

తాజాగా భవనీపూర్ తో పాటు మరో రెండు ఖాళీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల అధికార టీఎంసీనే విజయాన్ని సాధించటం ద్వారా.. బెంగాల్ లో తనకు తిరుగులేదన్న విషయాన్ని మరోసారి నిరూపించారు. తాజా ఉప ఎన్నికలో మమతా బెనర్జీకి మొత్తం 84 వేల ఓట్లులభించాయి. అంటే మొత్తం పోలైన ఓట్లలో 72 శాతం ఆమెకు సొంతమయ్యాయి. ఆమె ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి కేవలం 23 శాతం ఓట్లు రాగా.. మూడో స్థానంలో నిలిచిన సీపీఎం అభ్యర్థికి కేవలం రెండున్నర వేలు ఓట్లు మాత్రమే రావటం గమనార్హం.

తన ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి.. మరో కీలక వ్యాఖ్య చేయటం గమనార్హం. తాను ఓడిన విషయాన్ని అంగీకరిస్తున్నానని.. తానీ ఎన్నికపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనని చెప్పటం ద్వారా.. రానున్న రోజుల్లో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఎలాంటి ట్విస్టు ఉండవన్న విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు.. మమతకు అభినందనలు తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు మమతా బెనర్జీ థ్యాంక్స్ చెప్పారు. మిగిలిన రెండుస్థానాల్లో బీజేపీ.. సీపీఎం తరఫున పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినట్లుగా చెబుతున్నారు.