Begin typing your search above and press return to search.

బెంగాల్ పులి.. గుజరాత్ సింహాలకు లొంగిందా?

By:  Tupaki Desk   |   19 Sep 2019 2:30 PM GMT
బెంగాల్ పులి.. గుజరాత్ సింహాలకు లొంగిందా?
X
బెంగాల్ పులి ఆమె.. బెంగాల్ కేంద్రంగా దేశవ్యాప్తంగా గర్జించిన ధీరవనిత.. పశ్చిమ బెంగాల్ సీఎంగా దేశవ్యాప్తంగా చిరపరిచితమైన మమతా బెనర్జీ సైతం తాజాగా నిన్న మోడీని - నేడు అమిత్ షాను కలిసి విజ్ఞాపులు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

బుధవారం ప్రధాని మోడీతో భేటి అయిన బెంగాల్ సీఎం మమతా.. తాజాగా ఈరోజు గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో వీరి సమావేశం జరిగింది. అసోంలో అమలవుతున్న జాతీయ పౌర జాబితా అంశం బెంగాల్ లో అమలు చేయవద్దని ఆమె అమిత్ షాను కోరినట్టు మమత మీడియాతో తెలిపింది.

అయితే ధిక్కరించడం.. ఆదేశించడమే తెలిసిన మమతా తొలిసారి తన సహజధోరణికి భిన్నంగా ప్రధాని మోడీ, హోంమంత్రి షాలను కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బెంగాల్ పులి గుజరాత్ సింహాలైన మోడీషాలకు భయపడి సాగిలపడ్డారని సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు కోడై కూస్తున్నారు..

మొన్నటి ఎన్నికల వేళ అమిత్ షాను - మోడీని మమతా బెనర్జీ ముప్పుతిప్పలు పెట్టారు. అమిత్ షా హెలీక్యాప్టర్ కే పర్మిషన్ ఇవ్వలేదు మమతా. అయితే బెంగాల్ ఎన్నికల్లో చేదు ఫలితాల తర్వాత కూడా మమత సైలెంట్ అయ్యారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక మోడీషాలు నిర్వహించిన జాతీయ మీటింగ్ లకు మమత హాజరు కాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ బలం.. మోడీషాల సత్తువ చూసి మమత మెత్తబడి రాజీకి వచ్చినట్టు ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..