Begin typing your search above and press return to search.

అనూహ్యంగా మోడీకి ఆ ముగ్గురి మద్దతు

By:  Tupaki Desk   |   27 Nov 2016 12:56 PM IST
అనూహ్యంగా మోడీకి ఆ ముగ్గురి మద్దతు
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా దేశ వ్యాప్తంగా వామపక్షాల నేతృత్వంలో భారత్ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బంద్ ను విజయవంతం చేసేందుకు వామపక్ష పార్టీలు.. మిగిలిన విపక్షాల సాయం కోరుతున్న వేళ.. ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బంద్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. నోట్ల రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా పలు విపక్షాల్ని ఒక వేదిక మీదకు తీసుకొచ్చిన ఆమె.. కీలక సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. విపక్ష ఎంపీలతో రోడ్ల మీద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరసన చేయించారు. ఇప్పుడు అదే పార్టీ భారత్ బంద్ కు తమ మద్దతు ఉండదని తేల్చేసింది. మోడీ సర్కారు నిర్ణయంపై నిరసనలు.. ఆందోళనలు చేపడతామే తప్పించి భారత్ బంద్ లో మాత్రం భాగస్వామ్యం కామని తేల్చేశారు. ప్రధాని హోదాలో మోడీ తీసుకున్న రద్దు నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామని.. నోట్ల రద్దు కారణంగా తలెత్తే ఇబ్బందుల్ని మాత్రమే కాంగ్రెస్ ఎత్తి చూపుతుందని పేర్కొనటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. బీహార్ అధికారపక్షమైన జేడీయూ కూడా భారత్ బంద్ లో భాగస్వామ్యం కామని తేల్చేసింది. కీలకమైన పార్టీలు బంద్ కు దూరంగా ఉన్ననేపథ్యంలో దేశవ్యాప్తంగా అంతగా బలం లేని వామపక్షాలు.. మరికొన్ని విపక్షాలు నిర్వహించే భారత్ బంద్ ఎలా ఉంటుంది? ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా.. నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు కూడా ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ స్పష్టం చేయటం.. మోడీ అండ్ కోకు మరింత బలాన్ని పెంచుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/