Begin typing your search above and press return to search.

మమతను వదిలేట్లు లేరుగా ?

By:  Tupaki Desk   |   25 July 2022 6:13 AM GMT
మమతను వదిలేట్లు లేరుగా ?
X
రాజకీయంగా బద్ధశత్రువుగా తయారైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని బీజేపీ వదిలిపెట్టేట్లు కనబడటంలేదు. నాన్ ఎన్డీయే పార్టీల్లో నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలు ఎవరైనా ఉన్నారంటే అది మమత మాత్రమే. ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో కేంద్ర ప్రభుత్వానికి దూరమైన కేసీయార్ కూడా మోడీని వ్యతిరేకిస్తున్నారు. అయితే మమత మాత్రం సంవత్సరాలుగా మోడీ వ్యతిరేక రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే మమతను ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం బెంగాల్ గవర్నర్లుగా బాధ్యతలు తీసుకున్న వారు యథాశక్తి ప్రయత్నిస్తున్నారు.

సరే గవర్నర్ల పాత్రను పక్కన పెట్టేస్తే రాజకీయంగా ఎక్కడ అవసరమైతే అక్కడ, ఎక్కడ అవకాశముంటే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా మమత వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంటు లోపలా బయటకూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నారు. దాంతో మమతను ఎలా కంట్రోల్ చేయాలో ఇంతకాలం మోడీ సర్కార్ కు అర్ధంకాలేదు.

అలాంటిది అప్పుడెప్పుడో విద్యాశాఖలో ఉపాధ్యాయ నియమాకాల్లో జరిగిన అవినీతి అంశం ఇపుడు చేతికందింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ)ను రంగంలోకి దింపింది.

ఈ కారణంగానే మమతకు అత్యంత సన్నిహితుడైన పార్ధాఛటర్జీని అరెస్టుచేశారు. ఈ అరెస్టులు పార్ధాతో మాత్రమే ఆగేట్లు లేదట. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు కీలకమైన నేతల అరెస్టుకు కూడా రంగం రెడీ అవుతోందని సమాచారం. చుట్టూ ఉన్న సన్నిహితులను అరెస్టులు చేయటం ద్వారా మమతను మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.

శారదా చిట్ ఫండ్ స్కాం కూడా ఇంకా దర్యాప్తులో ఉంది. ఇందులో ఒకపుడు మమతకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు ఇపుడు బీజేపీలో ఉన్నారు. కాబట్టి ఆ స్కాం గురించి ప్రస్తావన రాకుండా మిగిలిన స్కాంల ఆరోపణల్లో మాత్రం దర్యాప్తును స్పీడు చేయాలని కేంద్రం డిసైడ్ చేసిందట. పార్లమెంటు ఎన్నికల్లో ఎంతమందిని వీలుంటే అంతమందిని అరెస్టులు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారట. జరుగుతున్నది చూస్తుంటే మమతను అంత తొందరగా వదిలేట్లు లేరు.