Begin typing your search above and press return to search.

దీదీ లెక్క‌!..బీజేపీకి ఏపీలో గుండు సున్నానేన‌ట‌!

By:  Tupaki Desk   |   16 May 2019 5:19 PM GMT
దీదీ లెక్క‌!..బీజేపీకి ఏపీలో గుండు సున్నానేన‌ట‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగింపు ద‌శ‌కు వ‌చ్చాయి. మొత్తం ఏడు ద‌శ‌ల్లో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే 6 ద‌శ‌లు ముగిసిపోగా... ఈ నెల 19న చివ‌రి ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ వెంట‌నే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. తొలి - మ‌లి ద‌శ‌ల పోలింగ్ ల‌లో బీజేపీకి పెద్ద‌గా ప‌ట్టు లేని ప్రాంతాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... ఆ త‌ర్వాత వ‌రుస‌గా బీజేపీకి గ‌ట్టి ప‌ట్టున్న ప్రాంతాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఒక్కో ద‌శ పోలింగ్ ముగుస్తుంటే... అధికార బీజేపీలో ఉత్సాహం పెర‌గాల్సింది పోయి... దాని స్థానే ఆందోళ‌న పెరుగుతోంది. అదే స‌మ‌యంలో ఒక్కో ద‌శ ముగుస్తుంటే... విప‌క్షాల్లో జోష్ పెరుగుతోంది.

ఈ క్ర‌మంలో విప‌క్షాలు ఎదురు దాడిని పెంచుతూ ఉంటే... బీజేపీ నేత‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయార‌ని చెప్పాలి. ఇలాంటి కీల‌క త‌రుణంలో మోదీ అన్నా - బీజేపీ అన్నా అంతెత్తున ఎగిరిప‌డుతున్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి - ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మతా బెన‌ర్జీ... బీజేపీ శిబిరంపై త‌న‌దైన శైలి సెటైర్లు వేశారు. త‌న‌ను గ‌ద్దె దింపడ‌మే ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతోంద‌ని - అయినా దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయన్న విష‌యంపై దీదీ ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల బేస్టియ‌న్‌లుగా నిలిచిన ఏపీ - త‌మిళ‌నాడులో బీజేపీకి ద‌క్కే సీట్లు ఎన్ని అన్న అంశంపైనా ఆమె ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు విప్పారు. అంత‌టితో ఆగ‌ని దీదీ... మొత్తంగా బీజేపీ ఈ ద‌ఫా ఎన్ని సీట్ల‌ను కోల్పోతుంద‌న్న విష‌యంపైనా ఆమె తన‌దైన జోష్యం చెప్పారు.

ఈ దిశ‌గా దీదీ చెప్పిన లెక్క‌లు ఎలా ఉన్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్ల లోపులోనే వ‌స్తాయ‌ట‌. ఏపీ - తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఆమె అన్నారు. అంటే... ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి గుండు సున్నానేన్న మాట‌. మహారాష్ట్రలో కూడా బీజేపీకి 20 సీట్లకు మించి రావని... మొత్తం మీద బీజేపీ 2014లో గెలిచిన 300 సీట్ల‌లో ఈ ద‌ఫా 200 సీట్లను కోల్పోనుందని దీదీ జోష్యం చెప్పారు. మ‌రి దీదీ జోష్యం ఏ మేర‌కు నిజ‌మ‌న్న విష‌యం ఈ నెల 23న తేలిపోతుంది.