Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రంట్‌ కు మ‌ళ్లీ ప్రాణం పోసిన మ‌మ‌త‌

By:  Tupaki Desk   |   12 May 2018 6:21 AM GMT
కేసీఆర్ ఫ్రంట్‌ కు మ‌ళ్లీ ప్రాణం పోసిన మ‌మ‌త‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు - ఆయ‌న అభిమానుల‌కు గొప్ప తీపిక‌బురు. దేశ‌రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కోస‌మంటూ కాంగ్రెస్‌ - బీజేపీయేత‌ర వేదిక ఏర్పాటుకు క్రియాశీలంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ఇప్ప‌టికే ప‌లు కీల‌క అడుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఆ ప్ర‌యత్నాలు ఒకింత స్త‌బ్ధత‌కు చేరాయి. అయితే తాజాగా కీల‌క ముంద‌డుగు ప‌డింది. ప్రాంతీయ శక్తులతో కూడిన ఫెడరల్ ఫ్రంట్‌దే భవిష్యత్ అని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా కాంగ్రెస్ ఏమీ సాధించలేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. ఓ బెంగాలీ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై స్పందించారు. లోక్‌ సభ ఎన్నికల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ర్టాల్లో ఘన విజయాలు నమోదు చేస్తాయి. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్‌దే భవిష్యత్. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం దేశానికి మంచిది అని పేర్కొన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిస్తే తానే ప్రధానమంత్రినని రాహుల్‌గాంధీ చేసిన ప్రకటనపై మమత స్పందించారు. `తన అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ అతనికి ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ సొంతంగా మెజార్టీ సాధించే అవకాశం లేదు`` అని చెప్పారు. `తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), టీడీపీ, బీజేడీ, ఆర్జేడీ పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ అధికారాన్ని ఎలా చేపడుతుంది?`అని ఆమె ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మీరు నేతృత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు స్పందించిన మమత.. ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబం తరహాలో పనిచేయాలి. దేశానికి ఏది మంచిదో అది చేయాలి అని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, టీడీపీ, డీఎంకే, ఆర్జేడీ పార్టీలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తాయన్నారు. కాంగ్రెస్ రహిత ప్రతిపక్ష కూటమితో బీజేపీని ఓడించడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని కాంగ్రెస్, బీజేపీ కూడా భావించడం లేదని ఆమె బదులిచ్చారు. దేశంలో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి కోసం ఫెడరల్ ఫ్రంట్ పనిచేస్తుందని స్పష్టంచేశారు.

కాగా, దాదాపుగా రెండు నెల‌ల క్రితం మ‌మ‌తాబెన‌ర్జీతో కేసీఆర్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. కోల్‌కతా సచివాలయంలో సోమవారం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దాదాపు రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జ‌రిగాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును సాధించే లక్ష్యంతో.. ప్రజలకోసం ఏర్పడే అతిపెద్ద ఫెడరల్ ఫ్రంట్ తమదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పునరేకీకరణపై తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించి సమిష్టి నాయకత్వంతో ముందుకు కదులాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫ్రంట్ ఏర్పాటుపై నిదానంగా అడుగులు వేస్తామని సంయుక్తంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు దేశ రాజకీయాలకు శుభ పరిణామమని మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. ఇకపై తాము కలిసి కదులుతామని ఇతర పార్టీలను కూడా ఈ వేదికపైకి తెస్తామని వెల్లడించారు.