Begin typing your search above and press return to search.

మోడీతో పెట్టుకోవాలని దీదీ అస్సలు అనుకోవటం లేదా?

By:  Tupaki Desk   |   1 Aug 2019 5:30 PM GMT
మోడీతో పెట్టుకోవాలని దీదీ అస్సలు అనుకోవటం లేదా?
X
రెండు రకాలైన నేతల్ని ఇప్పటివరకూ చూశాం. అందులో మొదటి రకం రాజీ పడి కలిసి పోవటం.. రెండో రకం రాజీ లేని పోరాడటం.. ప్రధాని మోడీ పుణ్యమా అని ఇప్పుడు మరో రకం కూడా కనిపిస్తోంది. కలవరు అలా అని రాజీ పడరు. అదే సమయంలో మోడీతో పెట్టుకోవటానికి ససేమిరా అనే ధోరణి దేశ రాజకీయాల్లో కనిపిస్తోంది. మోడీ అన్నంతనే విరుచుకుపడే దీదీ సైతం ఇప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం మొదలైంది.

తనకు తిరుగులేని బెంగాల్ కోటకు సార్వత్రిక ఎన్నికల్లో బీటలు వారేలా చేసిన మోడీతో పెట్టుకోవటం ఏ మాత్రం కరెక్ట్ కాదన్న భావనకు దీదీ వచ్చారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. సై అంటే సై అనే కన్నా.. తాను కామ్ గా ఉన్నా.. తనను వేధిస్తున్న మోడీ అన్న భావన బెంగాలీలలో కలిగేలా దీదీ ప్లాన్ చేస్తుందన్నట్లుగా ఆమె తాజా తీరు ఉందని చెప్పాలి. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్ లో ఎలా అయినా తాము పాగా వేయాలని డిసైడ్ అయ్యారు కమలదళం. అదే సమయంలో.. ఒకసారిక బీజేపీకి అవకాశం ఇస్తే.. అంతే సంగతులన్న విషయాన్ని గుర్తించిన దీదీ.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మోడీ విషయంలో ఏ మాత్రం తొందరపడటం లేదు.

తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన్ అధ్యక్షుడు రాజ్ థాకరే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిశారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరారు. దేశంలోనే మమతా బెనర్జీ అత్యంత ముఖ్యమైన నేత అని.. అందుకే ఆగస్టు 21న జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తానే స్వయంగా వచ్చినట్లుగా రాజ్ థాకరే చెప్పారు. అయితే.. ఆయన ఆహ్వానాన్ని దీదీ సున్నితంగా తిరస్కరించారు. తనకు ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం వేరే కార్యక్రమాలు ఉన్నాయని.. తాను హాజరు కాలేనని వ్యాఖ్యానించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ర్యాలీ నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని తాను కలవనున్నట్లుగా రాజ్ థాకరే చెప్పగా.. మీరు చేయబోయే ఉద్యమం మోడీకి వ్యతిరేకమా? అని దీదీ ప్రశ్నించటం గమనార్హం. దీనికి బదులుగా రాజ్ థాకరే బదులిస్తూ.. ర్యాలీ మోడీకి వ్యతిరేకం ఎంత మాత్రం కాదని.. ఈవీఎంలకు వ్యతిరేకంగా మాత్రమే తానీ ఉద్యమాన్ని చేపట్టినట్లుగా బదులిచ్చారు. చూస్తుంటే.. మోడీకి వ్యతిరేకమైన ఏ అంశంలోనూ దీదీ తలపెట్టేందుకు సిద్ధంగా లేరన్నట్లు అనిపించట్లేదు?