Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి ఎన్నిక ఎఫెక్ట్: కేసీఆర్‌కు మ‌మ‌త ఫోన్‌.. ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   12 Jun 2022 12:30 AM GMT
రాష్ట్రప‌తి ఎన్నిక ఎఫెక్ట్:  కేసీఆర్‌కు మ‌మ‌త ఫోన్‌.. ఏమ‌న్నారంటే
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్‌ చేశారు. 15న ఢిల్లీకి రావాలని కేసీఆర్‌ను మమత ఆహ్వానించారు. ఎన్డీయేతర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు మమత పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే 22 మంది విపక్ష నేతలకు మమతా బెనర్జీ లేఖ రాశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసీఆర్ హడావుడి పర్యటనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్ సీఎంల‌తో పాటు ప‌లువురి ప్ర‌ముఖుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ‌లు రాశారు.

ఇటీవల ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కేసీఆర్ కలిశారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ గంభీర ప్రకటన చేశారు. చివరికి రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో మౌనం దాల్చారు. పర్యటనలతో హడావుడి చేసిన కేసీఆర్‌ ఇలా ఒక్కసారిగా సైలెంట్‌ కావడంతో.. ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే దిశగా పావులు కదుపుతున్నారా? అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారా? దేశంలోని విపక్ష నేతలతో ఫోన్లలో సంభాషిస్తున్నారా? మళ్లీ బయటకు వచ్చి హడావుడి చేస్తారా? ఇంతటితోనే ఆగిపోతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే మమతా, కేసీఆర్‌కు ఫోన్ చేశారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు మమతా పిలుపునిచ్చారు.

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యూహ ప్రతివ్యూహాలు జోరందుకుంటున్నాయి. ‘విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి’ అని కాంగ్రెస్‌ భావిస్తుండగా... ‘మా అభ్యర్థి గెలుపు ఖాయం. కానీ... ఘన విజయం సాధించడమే మా లక్ష్యం’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇరుపక్షాలు కసరత్తు చేస్తున్నా యి. ‘ఉమ్మడి అభ్యర్థి’ ఎంపికపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రతిపక్షాలతో మంతనాలు ప్రారంభించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాకరేలతో స్వయంగా మాట్లాడారు.

సోనియా సూచనల మేరకు పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌తో చర్చలు జరిపారు. త్వరలో ఉద్ధవ్‌ ఠాకరేతోపాటు... డీఎంకే, తృణమూల్‌, వామపక్ష నాయకులను కలుస్తానని, వారితో సమావేశానికి తేదీలను నిర్ణయిస్తామని ఖర్గే తెలిపారు. బీజేపీయేతర ప్రధాన పార్టీలు ఒక అవగాహనకు వస్తే, మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వైఖరి నిర్ణయించుకోక తప్పదని కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.