Begin typing your search above and press return to search.

రాబోయే రోజుల్లో రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి?

By:  Tupaki Desk   |   8 April 2022 4:33 AM GMT
రాబోయే రోజుల్లో రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి?
X
ఒకసారి టార్గెట్ ఫిక్సు అయ్యాక.. ఎవరేమన్నా సరే.. వెనక్కి తగ్గకుండా అదే అంశం పై ఫోకస్ పెట్టే కొందరు అధినేతలు ఉంటారు. ఇలాంటి వారికి మిగిలిన అంశాలతోపని ఉండదు. తమ లక్ష్య సాధన మీదనే వారి చూపంతా. ఈ సందర్భంగా తమకు తోచినట్లుగా మాట్లాడే క్రమంలో చెప్పే మాటలు రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. ప్రధాని మోడీ అన్నా.. కేంద్రంలోని ఆయన ప్రభుత్వమన్నా ఏ మాత్రం ఇష్టపడని ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకరు.

నిత్యం ఏదో అంశం పై మోడీ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తారు. దేశం సర్వనాశనం అయిపోతుందని.. దారుణంగా దెబ్బ తింటోందని.. మోడీప్రభుత్వంలో తీవ్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న మాటల్ని ఆమె తరచూ చెబుతుంటారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల వరకు పెరగని ఇంధనం ధరలు.. ఆ తర్వాత నుంచి ఆకాశమే హద్దు అన్నట్లుగా రోజువారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

పెట్రోల్.. డీజిల్ ధరలకు రెక్కలు రావటంతో నిత్యవసర వస్తువులతో సహా అన్నింటి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వేళ.. నిత్యవసర వస్తువుల ధరల్ని తగ్గించేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఏమీ చేయటం లేదని మండిపడుతున్నారు మమతా బెనర్జీ. పెరిగే ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఆమె.. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదన్న జోస్యాన్ని చెప్పుకొచ్చారు. దీనంతటికి కేంద్రమే కారణంగా తేల్చారు. జీతాలు ఇవ్వలేకపోవటానికి కారణం.. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలుగా చెప్పుకొచ్చారు.

కేంద్రంలోని మోడీ సర్కారు తన వైరి వర్గం నేతల్ని.. ప్రతిపక్ష నాయకులను వేధించేందుకు సీబీఐ.. ఈడీలను ఉపయోగించే బదులుగా ధరలు తగ్గించే మార్గాల్ని వెతకాలంటూ సరికొత్త పంచ్ వేశారు. మరి.. దీదీ మాటలకు బీజేపీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.