Begin typing your search above and press return to search.

మోడీపై దీదీ కోపం.. రాహుల్ కు వరమైంది..

By:  Tupaki Desk   |   15 May 2019 5:48 AM GMT
మోడీపై దీదీ కోపం.. రాహుల్ కు వరమైంది..
X
శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న నానుడి నిజమవుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలోని స్వతంత్ర వ్యవస్థలన్నింటిని గుప్పిట పెట్టి ప్రతిపక్షాలను, ప్రాంతీయపార్టీలను కబలిస్తున్న నరేంద్రమోడీని గద్దెదించాలని ప్రాంతీయ పార్టీలన్నీ డిసైడ్ అవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలో 21 పార్టీలు దీనిపై సమాలోచనలు జరిపాయి.

ఈడీ,ఐటీ, ఆర్బీఐ సహా అన్ని వ్యవస్థలతో దాడులు చేయిస్తూ.. ఆధిపత్యం చెలాయిస్తున్న మోడీ బెంగాల్ సార్వత్రిక ఎన్నికల్లో నానా బీభత్సం చేస్తున్నారు. తృణమూల్ నాయకులపై ఐటీ , ఈడీ దాడులు చేయిస్తూ ఆర్థికంగా కుదేలు చేస్తున్నాడు. అందుకే మోడీని ఎదుర్కొనేందుకు దీదీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తృణమూల్ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తర్వాత మెజార్టీ సీట్లు సాధిస్తే ప్రధాని పీఠంపై కూర్చోవాలని బెంగాల్ సీఎం మమతా ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే అనుగుణంగానే ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు ఈనెల 21న ప్రాంతీయ పార్టీల భేటి ప్రతిపాదించగా మమత నో చెప్పారు. ఫలితాల తర్వాత చూద్దామన్నారు. కానీ ఇప్పుడు చివరి విడతలో బెంగాల్ లో మారణహోమం సృష్టిస్తున్న బీజేపీ వైఖరిపై గుర్రుగా ఉన్నా మమత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మమత తీసుకున్న నిర్ణయంతో దేశ రాజకీయాలే మారిపోయాయి.

తాను ఓడిపోయినా సరే.. మోడీని గద్దెదించాలన్న కృతనిశ్చయంతో ఉన్న మమతా బెనర్జీ ఈ మేరకు తన ప్రధాని పదవి కలను అవసరమైతే త్యజిస్తానని తృణమూల్ నేతల వద్ద ప్రస్తావించారట.. ప్రధాని రేసులో ఉన్న బెంగాల్ సీఎం మమత తాజాగా తన మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. మోడీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా విపక్ష కూటమిలోని మిగతా పార్టీల వారితో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రతిపాదించినట్లు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తృణమూల్ తాజాగా సంకేతాలు పంపింది. మమత తీసుకున్న ఈ తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కొండంత బలాన్ని ఇవ్వగా.. ప్రతిపక్ష బీజేపీ షాక్ తింది.