Begin typing your search above and press return to search.

దీదీకి షాకులు మొద‌ల‌య్యాయి!

By:  Tupaki Desk   |   25 May 2019 9:07 AM GMT
దీదీకి షాకులు మొద‌ల‌య్యాయి!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోడీ కోల్ క‌తాకు స‌మీపంలో నిర్వ‌హించిన ఒక స‌భ‌లో పాల్గొని ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే మే23న దీదీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని.. త‌న‌కు ఇప్ప‌టికే 40 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్న‌ట్లుగా చెప్పారు. మోడీ నోటి నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

దేశ ప్ర‌ధాని స్థానంలో ఉన్న వ్య‌క్తి నోటి నుంచే ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌ట‌మా? అన్న విమ‌ర్శ‌తో పాటు.. మోడీ చెప్పిన‌ట్లుగా బీజేపీ అధిక్య‌త సాధిస్తే.. బెంగాల్ లో మ‌మ‌త ప్ర‌భుత్వ మ‌నుగ‌డ సందేహంలో ప‌డుతుందా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎన్నిక‌లు పూర్తి కావ‌టం.. ఫ‌లితాలు వెలువ‌డ‌టం.. 2014తో పోలిస్తే మ‌రిన్ని ఎక్కువ స్థానాల్ని బీజేపీ సొంతంగా సాధించ‌టంతో పాటు.. దేశంలో బీజేపీకి తిరుగులేద‌న్న విష‌యం తాజా ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయి. ఫ‌లితాలు వ‌చ్చి రెండు రోజులు గ‌డిచాయో లేదో.. తాజాగా దీదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం వేళ మోడీ చెప్పిన‌ట్లే ఆయ‌న బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుభ్రాంగ్షు రాయ్ తాను బీజేపీలో చేర‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన కొద్ది రోజుల‌కే ఆయ‌నీ ప్ర‌క‌ట‌న చేశారు. కొన్ని రోజుల క్రితం పార్టీ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌టంతో ఆయ‌న్ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అలాంటి ఆయ‌న ఇంత‌కాలం మౌనంగా ఉండి.. తాజాగా త‌న ప్ర‌క‌ట‌న‌తో సంచ‌ల‌నంగా మారారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దీదీ కోట‌లో మోడీ పాగా వేసిన వైనం సాధించిన ఎంపీ స్థానాల్ని చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. దీదీ వెంట ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప‌ట్టుజారి పోతే మొత్తానికే ప్ర‌మాదం ముంచుకురావ‌టం ఖాయం. తాను టీఎంసీ (తృణ‌మూల్ కాంగ్రెస్)లో చేరుతున్న‌ప్పుడే త‌న తండ్రి త‌న‌నుజాగ్ర‌త్త‌గా ఉండు.. నీ మీద దాడి చేయొచ్చ‌ని చెప్పార‌ని..అలా కాకుంటే త‌ప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపొచ్చ‌న్న హెచ్చ‌రిక చేశార‌న్నారు.

టీఎంసీలో ఉన్న‌న్ని రోజులు త‌న‌కు ఊపిరి ఆడ‌న‌ట్లుగా అనిపించింద‌ని.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న‌ట్లుగా ఉంద‌న్నారు. రెండుసార్లు టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న నోటి నుంచే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయంటే.. దీదీ కోట‌లో లెక్క ఏదో తేడా వ‌చ్చిన‌ట్లు అనిపించ‌ట్లేదు?