Begin typing your search above and press return to search.

రాహుల్ ఒక బచ్చా..ఇదేం కూటమి!

By:  Tupaki Desk   |   28 March 2019 7:11 AM GMT
రాహుల్ ఒక బచ్చా..ఇదేం కూటమి!
X
ఒకవైపు బీజేపీ వ్యతిరేక కూటమి అంటారు, రాహుల్ గాంధీతో కలిసి ఆమె వేదికలు ఎక్కి చేతులు ఊపిన సందర్భాలూ ఉన్నాయి. మోడీని దించడమే తామందరి లక్ష్యం అని అంటారు. కట్ చేస్తే.. బెంగాల్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రచ్చ మామూలుగా లేదు.

ఇటీవలే కోల్ కతాకు వెళ్లాడు రాహుల్ గాంధీ. అక్కడ భారీ సభను నిర్వహించాడు. మమతా బెనర్జీ మీద తీవ్రంగా స్పందించారాయన. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలనూ వదల్లేదు. కమ్యూనిస్టుల దశాబ్దాల పాలనకూ - మమతా బెనర్జీ పాలనకూ ఏ మాత్రం తేడా లేదంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. వారిద్దరూ వద్దని.. కాంగ్రెస్ పార్టీని బెంగాల్ లో అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ పిలుపునిచ్చాడు. అక్కడ రాహుల్ కు మంచి స్పందన దక్కింది కూడా!

ఇక రాహుల్ కు తీవ్రమైన కౌంటర్లు ఇచ్చారు దీదీ. రాహుల్ గాంధీని ఒక బచ్చాగా అభివర్ణించారామె. రాహుల్ కు ఏమీ తెలియదని - అతడిని ఒక పిల్లాడి కింద జమకట్టింది మమతా బెనర్జీ. కమ్యూనిస్టులు వద్దు - కాంగ్రెస్ పార్టీ వద్దు.. తనకే ఓటేయాలని ఆమె అంటోంది. బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం కన్నా దీదీ రాహుల్ నే ఎక్కువగా కార్నర్ చేసుకోవడం ఆసక్తిదాయకమైన అంశం.

ఇది బీజేపీ వ్యతిరేక కూటమిలో కూడా గందరగోళానికి దారి తీసే అంశమే. వీళ్లంతా స్టేజిలు ఎక్కి.. మోడీని విమర్శిస్తారు. అంతా ఒక చోట ఉన్నప్పుడు వీళ్లందరి టార్గెట్ మోడీ. అయితే వేర్వేరు వేదికలు ఎక్కాకా మాత్రం వీరు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఈ మహాఘట్ బంధన్ విషయంలో కూడా జనాల్లో గందరగోళం ఏర్పడుతూ ఉంది. ఎన్నికల ముందు ఇలా విమర్శించుకున్న వీళ్లు..ఎన్నికల తర్వాత ఒకరికి ఒకరు ఏ మేరకు సహకరించుకుని.. కూటమి ప్రభుత్వాన్నిఏర్పాటు చేసుకుంటారనేది అనుమానంగానే కనిపిస్తోంది!